డేంజర్ జోన్‌లోకి నాగార్జునసాగర్.. ఎల్‌ నినో దెబ్బకు రైతుల్లో ఆందోళన

కలం, నల్లగొండ బ్యూరో : తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయినిగా నిలిచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Project) ఎల్‌ నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డేంజర్ జోన్ లోకి చేరింది. గురువారం సాయంత్రం నాటి ప్రాజెక్టు నీటిమట్టం 513.60 అడుగులకు పడిపోయింది. సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ఇప్పుడు కేవలం 137.86 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 590 అడుగులు కాగా, డెడ్ స్టోరేజీ మట్టమైన 510 అడుగులకు కేవలం 3.6(513.6) అడుగుల దూరంలో మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది కాస్తా కిందకు వెళ్తే సాగునీరు ఇవ్వడం పక్కన పెడితే.. తాగునీటిని లిఫ్ట్ చేయడం కూడా గగనంగా మారుతుంది.

నారు మడులు ఎండిపోయే పరిస్థితి

ఉమ్మడి జిల్లాలో సాగర్ ఆయకట్టు కింద దాదాపు 6.2 లక్షల ఎకరాల సాగు రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సాధారణంగా జూలై తొలి వారంలోనే సాగర్ గేట్లు ఎత్తి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడం పరిపాటి. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని దాదాపు 24 మండలాల్లో వరి సాగు ఇంకా ప్రాథమిక దశకు కూడా నోచుకోలేదు. నారుమడులు పోయడానికి నీరు అందకపోవడంతో రైతులు విత్తనాలు కొని దాచి పెట్టుకున్నారు. బోర్ల కింద సాగు చేపట్టినా కానీ భూగర్భ జలాలు పడిపోతుండటంతో నారుమడులు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది ఎల్ నినో తీవ్రత ప్రభావం మరింత స్పష్టంగా సాగర్ ఆయకట్టు రైతులపై కనిపిస్తోంది.

అప్పుల గుదిబండగా పెట్టుబడులు

“ఏటా నారుమడి పోసి, శ్రావణ మాసంలో నాట్లు వేసేవాళ్లం. ఈసారి అసలు నాగలి పట్టే పరిస్థితే రాలేదు. విత్తనాలకు, ఎరువులకు ముందే అప్పులు చేసి తెచ్చుకున్నాం. కాలం కలిసిరాకపోతే అవి ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు” అంటూ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే కాలం వెనుకపట్టు పట్టడంతో ఆయకట్టు కింద సన్న, చిన్నకారు రైతులను కొత్త గుబులు వెంటాడుతోంది. జూలై దాటి ఆగస్టులో నాట్లు వేస్తే పంట కాలం చలికాలంలో పూర్తవుతుంది. ఫలితంగా చలితీవ్రత పెరిగి గింజ పోయకుండా పొట్టుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో పాటు సాగునీరు అందక వరి సాగు ఆలస్యమైతే పశువులకు గడ్డి దొరక్క డెయిరీ సంక్షోభంలో పడే చాన్స్ ఉంది. మరోవైపు వ్యవసాయ పనులు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలు పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస బాట పట్టొచ్చు.

ముందస్తు ప్రణాళిక లోపమూ కారణమే..

సాగర్ ప్రాజెక్టు జల సంక్షోభం ప్రకృతి సృష్టించినది మాత్రమే కాదు. ముందస్తు ప్రణాళిక లోపమూ కారణమే. సాగర్‌లో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుందని తెలిసినా ప్రత్యామ్నాయ పంటల (ఆరుతడి పంటల) వైపు రైతులను మళ్లించడంలో వ్యవసాయ శాఖ సరిగా ప్రచారం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఎగువన ఉన్నఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండి, శ్రీశైలానికి వరద వచ్చి, అక్కడి నుంచి సాగర్‌కు లక్ష క్యూసెక్కుల ప్రవాహం వస్తే తప్ప కరువు పరిస్థితి నుంచి బయటపడే పరిస్థితి లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>