కలం, వరంగల్ బ్యూరో: మామునూరు ఎయిర్పోర్ట్ (Mamnoor Airport) పునరుద్ధరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మూడు పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్ నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య వివాదాలకు వేదికగా మారింది. ఎయిర్‌పోర్టు తెచ్చింది మేమంటే మేమే అంటూ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పోటీపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ, పార్టీల గ్రూపుల్లోనూ పోస్టులు, వీడియోలు, ఫొటోలను షేర్ చేసుకుంటూ.. పార్టీల వాదనలను బలపరిచే ప్రయత్నాలను ఆయా పార్టీల నేతలు చేస్తున్నారు. ఇలా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటుండగా మామునూరు ఎయిర్పోర్ట్ రాజకీయంగా మరింత హాట్ టాపిక్‌గా మారింది.
మాదంటే.. మాదే..?
అధికార కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖతో జరిపిన చర్చల ఫలితంగానే ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల హనుమకొండలో కాంగ్రెస్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఇందులో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు పాల్గొని సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని భూసేకరణ, అనుమతులు, కేంద్రంతో సమన్వయం చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించిందని చెప్పుకుంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూమిని కేసీఆర్ హయాంలోనే సేకరించామని, కేంద్రానికి కూడా పలుమార్లు ప్రతిపాదనలు పంపామని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తాము చేసిన పనులకు ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటుందని విమర్శిస్తున్నారు. ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు పునాది వేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అన్ని అనుమతులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఇప్పుడు కాంగ్రెస్ తామే తెచ్చామని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు.
ఇంకోవైపు బీజేపీ నేతలు కూడా.. ఎయిర్‌పోర్టుకు కేంద్రం ఆమోదం, గ్రీన్ సిగ్నల్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒప్పందం అడ్డంకులు తొలగిపోవడానికి ప్రధాని మోదీ చొరవతోనే సాధ్యమైందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు క్రెడిట్ పూర్తిగా తమదేనని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. క్రెడిట్ ఎవరికైనా దక్కొచ్చు కానీ, విమాన సర్వీసులు ప్రారంభమై వరంగల్ అభివృద్ధికి కొత్తదారులు వేయడమే ముఖ్యమని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్పోర్ట్ వరంగల్ అభివృద్ధి ప్రాజెక్టు మాత్రమే కాకుండా, కొద్ది నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడు పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్య పోరుకు కేంద్రంగా మారిందనే చర్చ నడుస్తోంది.

