కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో పరిస్థితులతోపాటు తక్కువ వర్షపాతం నమోదవుతున్నందున, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున ఎక్కువ నీటిని వినియోగించే వరి పంటకు బదులు తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలని ప్రభుత్వం చెప్తున్నా రైతులు వరి సాగుకే (Paddy Cultivation) మొగ్గు చూపుతున్నారు. గతేడాది ఇదే సమయానికి సాగులోకి వచ్చిన వరి విస్తీర్ణం కంటే ఈసారి సాగు చేస్తున్న వరి విస్తీర్ణమే ఎక్కువగా ఉన్నది. ఇది రాష్ట్ర వ్యవసాయ శాఖ కంటింజెన్సీ ప్రణాళికలో వెల్లడైంది. జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జలు లాంటివి పండించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ నిపుణులు, వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నా రైతులు మాత్రం వరి సాగుకే జై కొడుతున్నారు.
వరి నారుమళ్లు ఎండిపోతున్నా, బిందెలతో నీరు పోస్తున్నా, ట్యాంకర్ల ద్వారా నీటిని సమకూర్చుకుంటున్నా వరి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. రైతుల్లో (Telangana Farmers) ఆవగాహన కల్పించేందుకు ‘రైతునేస్తం’ పేరుతో వర్చువల్ కాన్ఫరెన్సులు నిర్వహించి తాజా పరిస్థితులను మంత్రి తుమ్మల వివరించారు. ఏడు రకాల సన్నాలనే పండించాలని, ప్రత్యామ్నాయ పంటలే బెస్ట్ అని అవగాహన కలిగించారు. అయినా పత్తి తర్వాత అత్యధికంగా సాగవుతున్నది వరి పంటనే.
కంటింజెన్సీ ప్రణాళిక ప్రకారం ఇదీ లెక్క
గతేడాది జులై 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 58.73 లక్షల ఎకరాల్లో పంటల సాగు విస్తీర్ణం ఉంటే ఈసారి అది 60.22 లక్షలకు పెరిగింది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, సంగారెడ్డి, గద్వాల, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో గణనీయంగా సాగువిస్తీర్ణం పెరిగింది. వరి సాగు విస్తీర్ణం గతేడాది ఇదే సమయానికి రాష్ట్రం మొత్తమ్మీద 5.66 లక్షల ఎకరాలు ఉంటే ఈసారి అది 6.37 లక్షల ఎకరాలకు పెరిగింది. పత్తి సాగు గతేడాది 37.48 లక్షల ఎకరాలుంటే ఈసారి అది 41.52 లక్షల ఎకరాలకు పెరిగింది. మొక్కజొన్న గతేడాది 5.71 లక్షల ఎకరాలుంటే ఈసారి అది 3.64 లక్షల ఎకరాలకు తగ్గింది. మిల్లెట్స్ సాగు గతేడతాది 5.99 లక్షల ఎకరాలుంటే ఈసారి అది 3.81 లక్షల ఎకరాలకు తగ్గింది.
ప్రభుత్వ విభాగాల పొంతన లేని లెక్కలు:
వ్యవసాయ మంత్రి విడుదల చేసిన కంటింజెన్సీ ప్రణాళికలో పేర్కొన్న లెక్కలకు, క్షేత్రస్థాయి నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు సేకరించిన వీక్లీ రిపోర్టు లెక్కలకు మధ్య పొంతన లేదు. కంటింజెన్సీ ప్రణాళికలో గతేడాదికంటే వరి సాగు విస్తీర్ణం పెరిగినట్లు గణాంకాలు ఉంటే, వ్యవసాయ శాఖ వీక్లీ లెక్కల్లో మాత్రం గతేడాదికంటే తగ్గినట్లు వెల్లడైంది. మొక్కజొన్న, పత్తి సాగు గతేడాదికంటే పెరిగినట్లు కంటింజెన్సీ ప్రణాళిక చెప్తే వ్యవసాయ శాఖ వీక్లీ లెక్కలు మాత్రం తగ్గినట్లు ధృవీకరించాయి.
రాష్ట్రవ్యాప్తంగా జూలై 15 నాటికి మొత్తం సాగు విస్తీర్ణం 59.84 లక్షలుగా వ్యవసాయ శాఖ వీక్లీ రిపోర్టు అంచనా వేస్తే.. ప్రణాళిక మాత్రం 60.22 లక్షల ఎకరాలు సాగైనట్లు చూపించింది. ఇందులో వరి సాగు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం గతేడాదికంటే తగ్గినట్లు పేర్కొంటే.. ప్రణాళిక ప్రకారం పెరిగినట్లు వెల్లడైంది. వ్యవసాయ శాఖలో విభాగాల మధ్య సమన్వయం కొరవడడంతో వాస్తవ లెక్కలు ప్రజలకు, ప్రభుత్వానికి చేరడంలేదు.
వ్యవసాయ శాఖ కంటింజెన్సీ ప్రణాళిక లెక్కలు :
మొత్తం సాగవుతున్న విస్తీర్ణం : 60.22 లక్షల ఎకరాలు
గతేడాది ఇదే సమయానికి : 58.74 లక్షల ఎకరాలు
ఈసారి వరి సాగు విస్తీర్ణం : 6.38 లక్షల ఎకరాలు
గతేడాది ఈ సమయానికి : 5.67 లక్షల ఎకరాలు
వ్యవసాయ శాఖ వీక్లీ రిపోర్టు లెక్కల ప్రకారం
మొత్తం సాగవుతున్న విస్తీర్ణం : 59.83 లక్షల ఎకరాలు
గతేడాది ఇదే సమయానికి : 60.95 లక్షల ఎకరాలు
ఈసారి వరి సాగు విస్తీర్ణం : 6.40 లక్షల ఎకరాలు
గతేడాది ఈ సమయానికి : 7.78 లక్షల ఎకరాలు

