కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) సమస్యల వలయంలో ఉక్కిరి బిక్కిరవుతున్నది. ఒకదాన్ని పరిష్కరించేలోపే మరొకటి పుట్టుకొస్తున్నది. ఊహకు అందని తీరులో ఎల్ నినో ముంచుకొస్తుండడంతో రైతాంగాన్ని సంతృప్తిపర్చలేక, అర్థం చేయించలేక సతమతమవుతున్నది. సాగునీరు లేదని రైతాంగంలో అయోమయం, తాగునీరు అందట్లేదని జనం ధర్నాలు, ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని విద్యార్థి సంఘాల ఆందోళనలు, జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగుల ర్యాలీలు.. ఇవన్నీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్ డీఏలకు మోక్షం లేదని, పీఆర్సీ ఇవ్వడంలేదని, జీతంలో కోత పెట్టినా హెల్త్ కార్డులు అందలేదనే అసంతృప్తిలో ఉన్నారు. వీటికి తోడు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎంత చేసినా మైలేజీ రాలేదన్న ఆవేదన..!
రైతులకు రైతుభరోసా నిధులను విడుదల చేసినా, రబీ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసినా, సన్న వడ్లకు బోనస్ అందించినా, ఉద్యోగులకు కోటిన్నర రూపాయల ప్రమాద బీమా అమలు చేస్తున్నా.. ఇవేవీ ప్రభుత్వానికి మైలేజ్‌గా మారలేదన్న వాదన మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్నది. స్వయంగా ముఖ్యమంత్రే నల్లగొండ సభలో “చేసింది చెప్పుకోలేకపోతున్నాం” అని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకున్నా ప్రతి నెలా రూ.1,100 కోట్లను ఇస్తున్నామని, అయినా వారిలో సంతృప్తి కనిపించడంలేదనే మాటలూ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
పెండింగ్‌లో ఉన్న డీఏ పేమెంట్స్, పీఆర్సీని తరచూ గుర్తుచేయడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 67 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం అనేక సభల్లో చెప్పినా.. దిల్‌సుఖ్‌నగర్‌లో, అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల నిరసనలు ఆగడం లేదు. భారీ స్థాయిలో ఖర్చు చేసినా వివిధ సెక్షన్ల ప్రజల్లో ఇంకా అసంతృప్తి కంటిన్యూ అవుతున్నదని లీడర్లే అంటున్నారు.
రోజుకో సమస్య..
గతంలో పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చి మెరుపు నిరసన తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారంటూ ఒకరిద్దరు మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. ఆ సమస్య సద్దుమణిగిందనుకునే లోపే అద్దె వాహనాల యజమానులు 18 నెలల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సర్వీసులను నిలిపివేశారు. డైట్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినా ప్రభుత్వానికి మైలేజ్ రాకపోగా ఫీజు రీయింబర్స్ మెంట్‌పై అటు విద్యార్థి సంఘాలు, ఇటు బీసీ సంఘాల డిమాండ్‌లు, ఇంకోవైపు ప్రతిపక్షాల దాడి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని సీఎం ప్రకటించినా.. గ్రామీణ ప్రాంతాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయంటూ ప్రజలు, తొమ్మిది గంటలే కరెంటు వస్తున్నదని రైతాంగం సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నాయి. తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో రోడ్లపై బైఠాయించారు.
ఎల్ నినోతో మరింత టెన్షన్
ఎల్ నినో ముంచుకొస్తున్నదంటూ రైతుల్ని అప్రమత్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆరుతడి పంటలవైపు మళ్లాలని అర్థం చేయిస్తున్నది. కానీ, అదే సమయంలో సాగునీటిని సరఫరా చేయడంలేదన్న రైతుల అసంతృప్తికి ఇటు ప్రభుత్వం నుంచి, అటు సాగునీటిపారుదల మంత్రి నుంచి, స్థానిక ఎమ్మెల్యేల నుంచి స్పష్టమైన స్పందన, సమాధానం లేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. నీళ్లను లిఫ్ట్ చేయాలని ప్రతిపక్షాల డిమాండ్లు మొదలవడం.. అదే క్రమంలో దేవాదుల, నార్లాపూర్ పంపులను ఆన్ చేయడం ఒకింత రిలీఫ్.
కానీ, ప్రతిపక్షాల ఒత్తిడి వల్లనే ప్రభుత్వం దిగి వచ్చిందనే అభిప్రాయం నెలకొన్నది. మేడిగడ్డ, ఎన్డీఎస్ఏ నివేదిక వ్యవహారం ఎలా ఉన్నా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఆలోచనలు చేయలేదనే విమర్శలూ సామాన్య ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎల్ నినో ఇలాగే కొనసాగి రైతులు ఆర్థికంగా నష్టపోతే ప్రభుత్వం నుంచి పరిహారం చెల్లించాల్సి వస్తుందనే ఆందోళన కూడా ఆర్థికశాఖ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. వీటికి తోడు మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి నాన్చివేత ధోరణి, క్లారిటీ లేకపోవడం కూడా రాష్ట్ర సర్కార్కు ఇబ్బందికరంగా మారింది.
సంస్థాగతంగా నేతల మధ్య గ్యాప్
పాలనలో వివిధ విభాగాల మధ్య పటిష్ట సమన్వయం ఉండాలంటూ చెప్తున్న ముఖ్యమంత్రికి పార్టీ నేతల మధ్య గ్యాప్, భేదాభిప్రాయాలు, రోడ్ల మీద నిరసనలు, ఘర్షణ వాతావరణం తలనొప్పిగా మారింది. మంత్రి కొండాసురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం, నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకర్తలు రోడ్డెక్కడం, యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యురాలు ఈశ్వరమ్మకు వ్యతిరేకంగా పార్టీ నేత పరుష విమర్శలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యం, పదవీకాలం ముగుస్తున్నవారికి రెన్యూవల్, మంత్రులకు – పార్టీ డీసీసీ అధ్యక్షులకు మధ్య కొరవడిన సమన్వయం.. ఇలాంటివన్నీ ఇటు పార్టీలోనూ సంతృప్తి లేదన్న సంకేతాలు వెలువడినట్లయింది.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో మకాం వేసి ఈ నేతల మధ్య పంచాయితీలను పరిష్కరించడానికి ప్రయత్నించడం, జిల్లాల పార్టీ ప్రెసిడెంట్లతో రెండు రోజుల సమావేశంలో పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం.. వీటిపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది.
కొన్ని నిరసనలు :
• పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ జూన్ 29న డీజీపీ ఆఫీసు ముట్టడి. 20 వేల పోస్టుల్ని భర్తీ చేయాలన్న డిమాండ్. ఆ తర్వాతి రోజే ఏడున్నర వేల ఉద్యోగాలపై డ్రాఫ్ట్ నోటిఫికేషన్.
• ఫీజు రీయింబర్స్ మెంట్ కోరుతూ మే 4న బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆందోళన, జూన్ 30న ఉన్నత విద్యా మండలి దగ్గర ఏబీవీపీ ధర్నా, జులై 13న సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రైవేటు విద్యా సంస్థల పిటిషన్.
• ప్రభుత్వ విభాగాలకు కార్లను అద్దెకు ఇచ్చినా 18 నెలలుగా బకాయిలు ఇవ్వడంలేదని 14న సచివాలయం దగ్గర యజమానుల ఆందోళన.
• ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్ ఇవ్వలేమని ట్రస్ట్ సీఈవోకు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల వెల్లడి.

