కలం, తెలంగాణ బ్యూరో: ‘సర్’ ప్రక్రియ (Telangana SIR)తో డబుల్ ఎంట్రీ, డూప్లికేట్ ఓటర్ల పేర్లు ఫిల్టర్ అవుతాయా?.. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో లక్షలాది మంది పేర్లు డిలీట్ అవుతాయా?.. ఈ ప్రాంతాల్లోని సెటిలర్ ఓట్ల సంఖ్య తగ్గుతుందా?.. ఇంతకాలం ఇలాంటి సందేహాలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న ‘సర్’ ప్రక్రియలో సెటిలర్ల ఓట్లు తగ్గే అవకాశం లేదని, యధాతథంగా ఉంటాయని క్షేత్రస్థాయిలోని యాక్టివిటీ చూసిన తర్వాత స్పష్టమవుతున్నది. ఇందుకు కారణం.. బీఎల్వోలు వాడుతున్న మొబైల్ యాప్‌లోని అంశాలే! ఒక రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఓటర్లుగా ఉంటే మాత్రమే ‘బీఎల్వో యాప్’ గుర్తిస్తున్నది. అదే, ఇతర రాష్ట్రాల్లోనూ ఓటర్లుగా ఉంటే మాత్రం గుర్తించలేకపోతున్నది. దీంతో ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి అక్కడ ఓటర్లుగా ఉన్నవారు తెలంగాణలోనూ ఓటర్లుగా ఉన్నట్లయితే ఈ యాప్ ఐడెంటిఫై చేయలేకపోతున్నది. ఫలితంగా తెలంగాణలో ఉంటున్న సెటిలర్ల ఓట్లు కంటిన్యూ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల డేటా లేకపోవడంతో..!
‘సర్’ ప్రక్రియలో.. 2002 నాటి ఓటర్ల జాబితాతో పోల్చి ప్రస్తుతం వివరాలను నమోదు చేసే క్రమంలో తగిన ధృవీకరణ లేనివారి పేర్లు ఇకపైన తయారయ్యే ‘ఓటర్ లిస్టు’ నుంచి డిలీట్ అయ్యే అవకాశాలున్నాయి. కానీ, ఏపీలో లేదా తమిళనాడులో ఓటర్లుగా ఉంటూనే తెలంగాణలో సైతం ఓటరు గుర్తింపు కార్డు ఉన్నవారిని బీఎల్వో మొబైల్ యాప్ గుర్తించలేకపోవడంతో ఇలాంటివారి పేర్లు డిలీట్ అయ్యే అవకాశం లేదన్నది సీఈవో ఆఫీస్ వర్గాల సమాచారం. ఇతర రాష్ట్రాల జాబితా బీఎల్వోల యాప్ లో అందుబాటులో లేకపోవడంతో ఇలాంటి డూప్లికేట్, డబుల్ ఎంట్రీ, క్రాస్-స్టేట్ డూప్లికేట్ ఎలెక్టర్లను పసిగట్టడం వీలుకావడంలేదు. కానీ, ఒకే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని మాత్రం ఈ యాప్ గుర్తించగలుతున్నది. దీంతో ఇలాంటి పేర్లు ఫిల్టర్ అవుతున్నాయి. సర్ ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాత కూడా క్రాస్ స్టేట్ డూప్లికేట్, డబుల్ ఎంట్రీలు యధాతథంగా ఉంటాయన్నది సీఈవో వర్గాల వాదన.
ఇక్కడ అసెంబ్లీ.. అక్కడ లోక్‌సభ ఎన్నికల్లో..
లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన కుటుంబాలు శాశ్వతంగా లేదా ఉపాధి కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో నివసిస్తున్నాయి. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ ఓటర్లుగా ఉన్నారు. దశాబ్దాలుగా ఓటర్ల జాబితాలో వీరి పేర్లు కంటిన్యూ అవుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని వారి స్వగ్రామాల్లోనూ ఓటర్లగా కొనసాగుతున్నారు. ఒకే వ్యక్తి రెండు రాష్ట్రాల్లోనూ ఓటర్లుగా ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తున్న వీరు ఆరు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ఆ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అక్కడికెళ్లి ఓటు వేస్తున్నారు. ఈ విషయం రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు తెలియనిదేమీ కాదు. తెలంగాణలో ఆరు నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
స్వచ్ఛందంగా వదులుకునేది ఎందరు?
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒకే నియోజకవర్గంలో మాత్రమే ఓటరుగా నమోదై ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఓటరుగా కొనసాగడం చట్ట విరుద్ధం. అయినా ఆచరణలో పరిస్థితి భిన్నం. ఉద్యోగం, వ్యాపారం, విద్య, స్థిర నివాసం తదితర అవసరాలతో ఏపీ, తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాల సెటిలర్లు తెలంగాణలో ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉంటున్నారు. సెటిలర్లలో ఏపీ వాళ్లే అధికం. తమ సొంత రాష్ట్రంలో ఓటును తొలగించుకోకుండానే ఇక్కడా సెటిలర్లు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకున్నారు. ఏక కాలంలో రెండు రాష్ట్రాల్లోనూ వారి పేర్లు కొనసాగుతున్నాయి.
సొంత రాష్ట్రంలో (ఏపీకి చెందినవాళ్లు) జరుగుతున్న ‘సర్’ ప్రక్రియలో వారి వివరాలన్నీ ఇచ్చి ఓటర్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడా ఐడీ కార్డులు, సర్టిఫికెట్లతో ధృవీకరించుకుని ఓటర్లుగానే ఉంటున్నారు. ఇలా రెండు చోట్ల ఉండటం, చేయించడం చట్టవిరుద్ధమని తెలిసినా ఎంత మంది స్వచ్ఛందంగా వదులుకుంటారనేది గమనార్హం. చట్టంలో నిబంధన ఉన్నా గుర్తించే ప్రక్రియలో లోపాలతో ఈ ఉల్లంఘన పరోక్షంగా చట్టబద్ధంగా మారింది. ఇది తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించినదే కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే ఉంది.
రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ‘సర్’ ప్రక్రియ కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాల్లోనూ బూత్ స్థాయి పరిశీలన, ఇంటింటి ధృవీకరణ, ఓటరు వివరాల నవీకరణ జరుగుతున్నది. కానీ రాష్ట్రాల మధ్య డేటా సమన్వయం లేకపోవడంతో క్రాస్ స్టేట్ డూప్లికేట్ ఎలెక్టర్లను గుర్తించలేకపోవడం ఒక లోపంగా మారింది. ఒకే రాష్ట్ర పరిధిలో ఒక వ్యక్తి రెండు లేదా ఎక్కువ నియోజకవర్గాల్లో పేరు నమోదు చేసుకుంటే మొబైల్ యాప్, సాఫ్ట్ వేర్ ద్వారా డూప్లికేషన్‌ను, డబుల్ ఎంట్రీని గుర్తించే అవకాశం ఉంది. కానీ, మరో రాష్ట్రంలో ఓటరుగా ఉన్న సమాచారాన్ని ప్రస్తుత వ్యవస్థ గుర్తించలేకపోతున్నది. అధికార వర్గాల నుంచే ఈ అభిప్రాయం వినిపిస్తున్నది. రెండు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వలసలు, హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత కుటుంబాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే రెండు రాష్ట్రాల్లోనూ పేర్లు కొనసాగిస్తున్న ఓటర్ల సంఖ్య దాదాపు 20 లక్షలకు పైగానే ఉన్నట్లు సమాచారం.

