కలం, వెబ్ డెస్క్ : అమెరికా (America)లో జాత్యహంకారం, మత విద్వేషం మరోసారి పడగవిప్పాయి. కేవలం ముస్లిం అనే కారణంతో హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తిపై ఓ దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన యూటా (Utah) రాష్ట్రంలోని వ్యాలీ ఫెయిర్ మాల్ (Valley Fair Mall)లో చోటుచేసుకుంది.
హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ సోహైల్ ఉద్దీన్ (37) ఉపాధి నిమిత్తం అమెరికాకు వలస వెళ్లి, అక్కడ వ్యాలీ ఫెయిర్ మాల్‌లో పనిచేస్తున్నాడు. సోహైల్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. జూలై 14న మాల్‌లో సోహైల్ తన విధుల్లో ఉండగా, పీటర్ మైఖేల్ లార్సెన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అంతకుముందే మాల్‌లోని పలువురిని మతం అడుగుతూ తిరిగిన ఆ దుండగుడు, సోహైల్ వద్దకు వచ్చి మొదట పేరు, దేశం అడిగాడు. తాను భారతదేశానికి చెందిన వ్యక్తినని సోహైల్ సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత సదరు దుండగుడు మళ్లీ మతం గురించి ప్రశ్నించగా.. తాను ముస్లిం అని సోహైల్ తెలిపాడు.
ఆ వెంటనే నీళ్ల బాటిల్ కావాలని అడిగినట్లు నటించిన మైఖేల్, సోహైల్ ఏమరపాటుగా ఉన్న సమయంలో తన జేబులో నుంచి కత్తిని తీసి ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. సోహైల్ శరీర భాగాలపై ఏకంగా 15 సార్లు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఊహించని ఈ దాడితో సోహైల్ రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి ఉద్యోగులు, స్థానికులు వెంటనే స్పందించి నిందితుడు మైఖేల్‌ను పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన సోహైల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు పీటర్ మైఖేల్ లార్సెన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. ముస్లింలను చంపాలనే ఉద్దేశంతోనే తాను మాల్‌లోకి ప్రవేశించానని, సోహైల్ ముస్లిం అని తెలియగానే చంపడానికి ప్రయత్నించానని నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.

