రిధిమా దూకుడు.. WPGTలో టాప్ ప్లేస్ సొంతం

కలం, స్పోర్ట్స్ : కర్ణాటకలోని కోలార్ జియాన్ హిల్స్ గోల్ఫ్ కౌంటీలో జరుగుతున్న మహిళల ప్రో గోల్ఫ్ టూర్ (WPGT) పదో లెగ్‌లో భారత గోల్ఫర్ రిధిమా దిలావరీ (Ridhima Dilawari)  తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గురువారం ముగిసిన రెండో రౌండ్ తర్వాత ఆమె అగ్రస్థానంలో నిలిచింది. రెండో రౌండ్ ముగిసే సమయానికి రిధిమా తన ఆధిక్యాన్ని ఒక షాట్ నుంచి రెండు షాట్లకు పెంచుకుంది. చివరి దశలో డబుల్ బోగీ ఎదురైనా వెంటనే పుంజుకుని ఆధిక్యాన్ని కాపాడుకుంది.

ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు టైటిళ్లు గెలుచుకున్న రిధిమా.. రెండో రౌండ్‌లో ఐదు బర్డీలు, రెండు బోగీలు సాధించింది. అయితే 17వ హోల్‌లో డబుల్ బోగీతో కాస్త ఒత్తిడికి గురైనప్పటికీ, చివరి హోల్‌లో బర్డీ సాధించి తిరిగి పుంజుకుంది. మొదటి రౌండ్‌లో 68 స్కోరు నమోదు చేసిన రిధిమా.. రెండో రౌండ్‌ను 1-అండర్ 71తో ముగించింది. ప్రస్తుతం ఆమె మొత్తం 5-అండర్ 139 స్కోరుతో టాప్‌లో కొనసాగుతోంది. 141 స్కోరుతో ఉన్న అమన్‌దీప్ డ్రాల్, విధాత్రి ఉర్స్ కంటే రెండు షాట్ల ఆధిక్యంలో ఉంది. గత వారం విజేతగా నిలిచిన వాణి కపూర్ ఈసారి రెండో రౌండ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఎనిమిది, తొమ్మిదో హోల్స్‌లో వరుస తప్పిదాలతో నాలుగు బోగీలు నమోదు చేసి 1-ఓవర్ 73 స్కోరుతో నాలుగో స్థానానికి పరిమితమైంది.

యువ క్రీడాకారిణి సాన్వి సోము మంచి ఆరంభం ఇచ్చింది. తొలి ఆరు హోల్స్‌లో నాలుగు బర్డీలు సాధించినప్పటికీ, తర్వాత రెండు డబుల్ బోగీలతో ఆమె వేగం తగ్గింది. ఈవెన్ పార్ 144 స్కోరుతో ఐదో స్థానంలో నిలిచింది. కాశికా మిశ్రా ఆరో స్థానంలో, మన్నత్ బ్రార్ ఏడో స్థానంలో, రియా జాదన్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నారు. మరో ఐదుగురు క్రీడాకారిణులు తొమ్మిదో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో కట్ స్కోరును 155గా నిర్ణయించగా, మొత్తం 34 మంది క్రీడాకారిణులు మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. సెహర్ అత్వాల్, శ్వేత మాన్‌సింగ్, దుర్గ నిట్టూర్ వంటి ప్రముఖ గోల్ఫర్లు కట్ సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>