కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్‌కప్‌లో జట్ల సంఖ్య పెరిగితే భారత్‌కు అవకాశం పెరుగుతుందని భారత కెప్టెన్, గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు (Gurpreet Singh Sandhu) అభిప్రాయపడ్డాడు. అయితే ఆ ఆలోచనలో మునిగిపోకుండా ముందుగా ఆసియాలో టాప్-15లోకి చేరడంపై దృష్టి పెట్టాలని చెప్పాడు. 2030 ఫిఫా వరల్డ్‌కప్‌ను 64 జట్లతో నిర్వహించే ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో ఇటీవల మద్దతు తెలిపాడు. ఈ ప్రతిపాదనపై ప్రపంచ ఫుట్‌బాల్‌లో చర్చ కొనసాగుతోంది.
జట్ల సంఖ్య పెరగడం భారత్‌కు సానుకూలమేనని గుర్ప్రీత్ అన్నాడు. అయితే యూరప్‌లో ఇప్పటికే ఏడాదికి 50 నుంచి 60 మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లపై అదనపు భారం పడుతుందని అభిప్రాయపడ్డాడు. అలసట, లీగ్ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకునే ఫిఫా ఈ నిర్ణయంపై ఆలోచిస్తుందని పేర్కొన్నాడు. భారత ఫుట్‌బాల్ అభిమానిగా తాను కూడా త్వరగా వరల్డ్‌కప్‌లో భారత్ ఆడాలని కోరుకుంటున్నానని చెప్పాడు.
కానీ ప్రస్తుతం ఆ లక్ష్యం కంటే ఆసియాలో టాప్-15లోకి చేరడమే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు వెళ్లాలే తప్ప ఒకేసారి పెద్ద లక్ష్యాన్ని అందుకోవాలని చూడకూడదని గుర్ప్రీత్ సూచించాడు. ఆసియాలో బలమైన జట్టుగా ఎదగడమే భారత ఫుట్‌బాల్‌కు సరైన దారి అని అభిప్రాయపడ్డాడు.

