నీట్ రీ–ఎగ్జామ్ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్: నీట్ (NEET) రీ–ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. జూన్ 21న నిర్వహించిన ఈ పరీక్షను 20 లక్షల మంది విద్యార్థులు రాయగా.. 11.21 లక్షల మంది క్వాలిఫై అయినట్లు ఎన్టీఏ పేర్కొంది. వీరిలో 58 శాతం మహిళలే ఉన్నట్లు వెల్లడించింది. 13 భాషల్లో పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 551 పట్టణాల్లో 5,440 కేంద్రాల్లో పరీక్షను అత్యంత భద్రత నడుమ నిర్వహించిన విషయం తెలిసిందే. టాప్ ర్యాంకర్లతో పాటు స్టేట్ ర్యాంకర్లు, కేటగిరీల వారీగా టాపర్ల వివరాలను http://neet.nta.nic.in వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది.

టాప్ ర్యాంకర్లు వారే..

పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానా రాష్ట్రానికి చెందిన పన్షుల్ బన్సల్ 720 మార్కులకు గాను 715 మార్కులు సాధించి టాప్ స్కోరర్లుగా నిలిచారు. 700 మార్కులపై వచ్చిన వారు 19 మంది, 690 మార్కులకు పైగా వచ్చినవారు 138 విద్యార్థులు ఉన్నారు. పరీక్ష క్వాలిఫై అయినవారిలో 99 శాతం 17–19 ఏళ్ల వయస్సు వారే కావడం గమనార్హం.

ఓబీసీ కేటగిరీ వారే అధికం..

నీట్ రీ–ఎగ్జామ్ క్వాలిఫై అయినవారిలో ఓబీసీ కేటగిరీకి చెందినవారే 5.12 లక్షల మంది ఉండటం గమనార్హం. జనరల్ కేటగిరీ 2.91 లక్షల మంది, ఎస్సీ కేటగిరీ వారు 1.59 లక్షల మంది, ఎస్టీ కేటగిరీ వారు 63,716 మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినవారు 95,026 మంది, PWBD కేటగిరీ వారు 3,666 మంది, PWD కేటగిరీ వారు 303 మంది ఉన్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.

కౌన్సెలింగ్ ఎప్పుడంటే..

ఆలిండియా కోటాలో భాగంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. ఇది పూర్తయ్యాక, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్రాలే నిర్వహిస్తుంటాయి. తేదీలను త్వరలోనే వెల్లడించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సీట్లు ఇప్పిస్తామంటూ డబ్బు వసూళ్లకు పాల్పడితే నమ్మవద్దని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్టీఏ సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>