కలం, వెబ్ డెస్క్: ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరణానంతరం జరిగిన పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన అంతిమ సంస్కారాల్లో కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను నిరాకరించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందంటూ, ముఖ్యంగా జగన్ ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకున్నారని పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. దీనిపై ముద్రగడ పద్మనాభం కుమారులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
ముద్రగడ పద్మనాభం ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి నిలువుటద్దమని, ఆయన రాజకీయ జీవితంలో పదవుల కన్నా వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. తమ తండ్రి మరణానంతరం తమను ఓదార్చి అండగా నిలిచిన వారికి, అంతిమ కార్యానికి హాజరైన వారికి, రాలేకపోయినా తమ తండ్రి, కుటుంబం పట్ల ప్రేమ, ఆప్యాయత చూపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ సమయంలో తమకు ఎంతో అండగా నిలిచారన్నారు.
ఇదే సమయంలో తమ వ్యక్తిగత విషయాలపై మీడియాలో దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.తన మరణానంతరం తన అంతిమ కార్యాలు ఎలా జరగాలన్నది ముద్రగడ ముందే నిర్ణయించారని వెల్లడించారు. బార్లపూడి క్రాంతికి, తమ కుటుంబానికి కొన్నేళ్లుగా రాకపోకలు లేవని, ఈ విషయం ముద్రగడ సైతం పలు సందర్భాల్లో చెప్పారని అన్నారు.
బార్లపూడి క్రాంతి ముద్రగడ అంతిమ కార్యాలకు రాకపోవడం మొదలు, ప్రభుత్వ లాంఛనాల నిరాకరణ, ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలన్నది.. ఇలా ప్రతీది ఆయన అంతిమ నిర్ణయమేనన్నారు. దీని వెనుక ఎవరి ఒత్తిడి, ప్రోద్బలం లేవన్నారు. దయచేసి మీడియా మిత్రులు తమ కుటుంబంపై లేనిపోనివి ప్రసారం చేసి తమనకు క్షోభకు గురిచేయవద్దని కోరారు.

