కలం, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న సూర్యాపేట జిల్లా మట్టపల్లి (Mattapalli) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మహర్దశ పట్టనుంది. హుజూర్‌నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని ఈ చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రానికి మౌలిక వసతుల కల్పన, పర్యాటక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.13 కోట్ల నిధులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి ఉత్తమ్ పట్టుబట్టి మరీ..
హుజూర్‌నగర్ నియోజకవర్గానికి మకుటాయమానంగా ఉన్న మట్టపల్లి క్షేత్రాన్ని ఈ నిధులతో దేవాలయ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులను ఆకట్టుకునేలా కృష్ణా నదిలో బోటింగ్ సౌకర్యాలను కూడా కల్పించనున్నారు. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మార్చాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద పెట్టారు.
పలుమార్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నిధుల మంజూరుకు అవసరమైన ప్రక్రియ వేగవంతం చేసి, ఉత్తర్వులు వచ్చేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి చేశారు.
మెరుగుపడనున్న బస సౌకర్యాలు..
మట్టపల్లి నరసింహుడి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. తాజా నిధుల మంజూరుతో ఇక్కడ భక్తులకు అవసరమైన బస సౌకర్యాలు, రవాణా, కృష్ణా నది తీరాన పర్యాటక హంగులు సమకూరనున్నాయి. ఈ నిర్ణయం ద్వారా హుజూర్‌నగర్ నియోజకవర్గ వికాసానికి మరో కీలక అడుగు పడినట్లయింది.

