కలం, వెబ్ డెస్క్: భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు (Gurnoor Brar) అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) షాక్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను అతనికి అధికారిక హెచ్చరిక జారీ అయింది. ఈ విషయాన్ని ఐసీసీ గురువారం అధికారికంగా ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తుండగా ఎనిమిదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. గుర్నూర్ బ్రార్ తాను వేసిన బంతిని అందుకుని, ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ వైపు బలంగా విసిరాడు.
మైదానంలోని అంపైర్లతో పాటు థర్డ్, ఫోర్త్ అంపైర్లు దీనిని గమనించారు. ఆ త్రో చాలా ప్రమాదకరంగా, పద్ధతి లేకుండా ఉందని మ్యాచ్ అధికారులు తేల్చారు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆటగాళ్లపైకి ఇలా ప్రమాదకరంగా బంతులు విసరడం నేరం. ఈ లెవెల్-1 తప్పు కింద గుర్నూర్ బ్రార్‌కు హెచ్చరికతో పాటు అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డెమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు.
మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్సన్ విధించిన ఈ శిక్షను గుర్నూర్ బ్రార్ ఒప్పుకున్నాడు. తప్పు అంగీకరించడంతో ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి తప్పులకు 24 నెలల పాటు డెమెరిట్ పాయింట్లు రికార్డులో ఉంటాయి. రెండేళ్లలో ఇలా నాలుగు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు వస్తే ఆటగాళ్లపై నిషేధం పడే అవకాశం ఉంటుంది.
అయితే ఈ వివాదం పక్కన పెడితే గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో బాగా ఆకట్టుకున్నాడు. రెండు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని బౌలింగ్ సాయంతోనే టీమిండియా మొదటి వన్డేలో ఆరు వికెట్ల తేడాతో గెలిచి, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య కార్డిఫ్‌లో గురువారం రెండో వన్డే జరగనుంది. మైదానంలో ఆటగాళ్లు దూకుడుగా ఉండటం సహజమే అయినా, క్రీడా నిబంధనల పరిధిలో ఆడటం అందరికీ అవసరమనేది విశ్లేషకుల అభిప్రాయం.

