కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లో(Khajipur) ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీపై(Sand Quarry) వివాదం ముదురుతోంది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, సాగు, తాగునీటి సమస్యలు తీవ్రంగా మారాయని ఆరోపిస్తూ గ్రామస్థులు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) మద్దతు తెలిపారు. గురువారం గ్రామస్థులతో కలిసి ఖాజీపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, ఖాజీపూర్‌లో గతంలో ఇసుక నిల్వలు సమృద్ధిగా ఉండటంతో పరిసర గ్రామాలకు సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదని అన్నారు. ప్రభుత్వం క్వారీకి అనుమతులు ఇచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని విమర్శించారు.
ప్రభుత్వం మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చినా, కాంట్రాక్టర్లు మాత్రం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా, ఖాజీపూర్‌తో పాటు ఎలగందుల, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. రైతులు నార్లు ఎండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇసుక క్వారీ వల్ల కలుగుతున్న సమస్యలను ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు తీసుకోలేదని గంగుల ఆరోపించారు. రైతుల కష్టాల కంటే ప్రభుత్వానికి ఆదాయంపైనే దృష్టి ఉందని విమర్శించారు.
తన స్వంత పొలానికి కూడా సాగునీరు అందక పంటలు ఎండిపోయాయని పేర్కొన్న ఆయన, రైతుల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే ఇసుక క్వారీ కార్యకలాపాలను నిలిపివేసి, అక్కడ ఉన్న లారీలను వెనక్కి పంపించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్లో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో సంఘటన స్థలానికి చేరుకుని ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు తమ ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

