కలం, వెబ్ డెస్క్: ఇటీవల ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan)కు హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అమీర్ ఖాన్ని చంపేసిన వారికి రూ.5 కోట్లు బహుమానంగా ఇస్తానని అయోధ్యకు చెందిన స్వామి జగద్గురు పరమహంస (Swami Jagadguru Paramhans) ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొద్ది రోజుల క్రితం అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్‌ను మూడో పెళ్లి చేసుకున్న సందర్భంగా ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మాజీ భార్యల సమక్షంలోనే వివాహం జరిగినా నెటిజన్లు ఈ పెళ్లిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ వయసులో మరో పెళ్లి ఏమిటంటూ కామెంట్లు చేశారు. ఇక మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే ఈ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ లవ్ జిహాద్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. దీనికి కొనసాగింపుగా జగద్గురు పరమహంస ఈ ప్రకటన చేశారు.
అమీర్ ఖాన్ కేవలం హిందూ మతానికి చెందిన మహిళలను పెళ్లి చేసుకుంటున్నారని పరమహంస విమర్శించారు. ఇలాంటి వారిని అంతం చేస్తేనే లవ్ జిహాద్ ఆగిపోతుందన్నారు. అమీర్ ఖాన్ని చంపేసిన వారికి న్యాయపరమైన ఖర్చులు భరిస్తూ, వారి కుటుంబానికి రూ.5 కోట్లు ఆర్థిక సాయం అందిస్తానని పరమహంస అన్నారు. లవ్ జిహాద్ పేరుతో తనపై వరుసగా జరుగుతున్న మాటల దాడిపై అమీర్ ఖాన్ ఇప్పటి వరకు స్పందించలేదు.

