ప్రభుత్వ ఉద్యోగం.. ప్రైవేట్ వ్యాపారం?

కలం, వరంగల్ బ్యూరో : కొందరు డాక్టర్లు రూ. లక్షల్లో సర్కార్ జీతం తీసుకుంటూ.. ప్రైవేట్ గా వైద్యం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఇలా ప్రభుత్వ సేవా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ వైద్య సేవలు అందిస్తుండగా సంబంధిత ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్య వర్గాల్లో ప్రస్తుతం కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ (KMC Principal) డాక్టర్ మోహన్ దాస్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ కొలువు చేస్తూనే హనుమకొండలో భారీగా ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. గతంలో నర్సంపేట మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ నియామకాలు, రాజకీయ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు రావడం వంటి అంశాలు మళ్లీ చర్చకు దారి తీస్తున్నాయి.

ఔట్ సోర్సింగ్ నియామకాల వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొనడం, నర్సంపేట ఎమ్మెల్యే మాధవరెడ్డి తో విభేదాలు తలెత్తాయి. డాక్టర్ పై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యే ఆపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు మోహన్ దాస్ ప్రభుత్వానికి సరెండర్ కావడం అప్పట్లో సంచలనం రేపింది. కొద్ది రోజులకే మళ్లీ ఉన్నతాధికారుల మద్దతుతో మోహన్ దాస్ తిరిగి కేఎంసీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టడం వైద్య వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సరెండర్ చేసిన వ్యక్తి పోస్టింగ్ పొందే క్రమంలో నిర్వహించే కౌన్సిలింగ్ లో పాల్గొనేందుకు అనర్హుడుగా పరిగణిస్తారని తెలుస్తోంది. కానీ ఆయన తన పలుకుబడితో ఉన్నతాధికారులను మేనేజ్ చేసి కేఎంసీ ప్రిన్సిపల్ గా పోస్ట్ లోకి వచ్చినట్టు ప్రచారంలో ఉంది.

లోకల్ గా ఉండడంతో అతని ప్రైవేట్ వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేసి కేఎంసీ ప్రిన్సిపల్ పోస్టింగ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలు పక్కనపెట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ పైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు హనుమకొండలో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి కూడా చర్చనీయాంశంగా మారింది. కేఎంసీ ప్రిన్సిపాల్ హోదాలో కాలేజీ వ్యవహారాలు చక్క పెట్టాల్సింది పోయి పదవిని అడ్డుపెట్టుకొని భారీ స్థాయిలో ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో పలు ఆసుపత్రుల నిర్వహణ

హనుమకొండ, వరంగల్ జంటనగరాల్లో పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఆయన నిర్వహిస్తున్నట్లు సమాచారం. సుబేదారిలో తన ఇంట్లోనే పెద్ద ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనపై వచ్చిన పలు ఫిర్యాదులతో ఆసుపత్రి పేరును మార్చేశారు. ఆపరేషన్లలో ఎక్స్ పర్ట్ కావడంతో పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సొంత ఆసుపత్రిలో రోగుల నుంచి ఇష్టారీతిన ఫీజులు గుంజుతున్నట్లు, అధిక ధరలతో మందుల అమ్మకాలు చేస్తున్నట్టు పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. టెస్టులు, మెడికల్ సర్వీస్ ల పేరిట రోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. హనుమకొండలోని విజయ టాకీస్ సమీపంలో భారీ స్థాయిలో ఆసుపత్రి నిర్మిస్తున్న తీరు వైద్య వర్గాల్లోనే విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ వైద్య సేవల్లో ఉండి ప్రైవేట్ వైద్యంపైనే మక్కువ చూపుతున్న తీరుపై ఉన్నతాధికారులు కూడా సైలెంట్ గా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>