జైలు నుంచి వచ్చినా మారలేదు.. మళ్లీ అదే పని చేస్తూ బుక్కయ్యారు

​కలం, ఖమ్మం బ్యూరో : తప్పు చేసి జైలుకెళ్లినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. శిక్ష అనుభవించి బయటకు వచ్చినా బుద్ధి మార్చుకోకుండా, ఈజీ మనీ కోసం మళ్లీ పాత దారే తొక్కాడు. స్నేహితులను కూడగట్టుకుని అంతరాష్ట్ర గంజాయి రవాణాకు తెరలేపిన పాత నేరస్థుడు, చివరకు పోలీసుల వాహన తనిఖీల్లో ముగ్గురు సభ్యుల ముఠాతో సహా అడ్డంగా బుక్కయ్యాడు. కల్లూరు (Kalluru) పరిధిలో రూ. 1.50 లక్షల విలువైన గంజాయితో పట్టుబడిన ఈ ముఠా వివరాలను సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం మంగళవారం వెల్లడించారు.

​పోలీసుల కథనం ప్రకారం.. కల్లూరు పట్టణానికి చెందిన షేక్ హబీబ్ గత ఏడాది ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయి రిమాండ్‌కు వెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్నాళ్లు రెస్టారెంట్‌లో పనిచేసినప్పటికీ, ఇటీవల పని లేకపోవడంతో మళ్లీ మత్తు వ్యాపారం వైపు మళ్లాడు. మణుగూరులోని అత్తగారింటికి వెళ్లిన సమయంలో తన పాత స్నేహితుడైన తేజావత్ రమేష్‌తో కలిసి గంజాయి సేవించాడు.

మళ్లీ మత్తుకు బానిసైన హబీబ్, కల్లూరు రాగానే గంజాయి కోసం బొడ్డు చందును సంప్రదించాడు. చందు రూ. 500లకు కొద్ది మొత్తంలో గంజాయి తెచ్చి ఇచ్చినప్పటికీ, ధర ఎక్కువ, పరిమాణం తక్కువగా ఉండటంతో నేరుగా ఒరిస్సా నుంచే తేవాలని ప్లాన్ వేశారు. వాహనం ఏర్పాటు చేసినందుకు గానూ తేజావత్ రమేష్‌కు 500 గ్రాముల గంజాయిని వాటాగా ఇచ్చి, జూలై 7న హబీబ్, చందులు ఒరిస్సాలోని మల్కనగిరికి వెళ్లారు.

​అక్కడ సన్నీ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసిన 3 కేజీల గంజాయిని కల్లూరు తెచ్చి, పేరవంచ గ్రామానికి చెందిన ప్రవీణ్, చిన్న ప్రవీణ్, హరీష్ ల ద్వారా విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో జూలై 13న హబీబ్, చందు, రమేష్‌లు బైక్‌పై పేరవంచ వెళ్తుండగా, స్థానిక షుగర్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు.

స్వాధీనం చేసుకున్న 3 కేజీల గంజాయి విలువ సుమారు రూ. 1,50,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన కల్లూరు ఎస్ఐ హరిత, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహారావు, లక్ష్మీపతి, ఇతర కానిస్టేబుళ్ల బృందాన్ని సిఐ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>