కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక నియోజకవర్గంలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ, కాలువలకు నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) మండిపడ్డారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని.. కూడవెల్లి వాగు, దుబ్బాక, దౌల్తాబాద్, ఉప్పరపల్లి, రామాయంపేట కెనాల్స్‌కు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో నీళ్లు ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయని, వెంటనే నీళ్లను విడుదల చేయాలన్నారు.
దుబ్బాక (Dubbaka) నియోజకవర్గ అభివృద్ధి కోసం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రావు (Kotha Prabhakar Reddy) మాట్లాడుతూ.. దుబ్బాకలో రహదారుల పరిస్థితి దయనీయంగా ఉందని అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గంలో పంచాయతీ రాజ్, R&Bకి సంబంధించిన రోడ్లన్నీ చాలా అధ్వాన్నంగా, భయంకరంగా ఉన్నాయని అన్నారు. వర్షాకాలం వస్తున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రోడ్ల కోసం దాదాపు 60 ప్రతిపాదనలు పంపితే కేవలం రెండిటికే అనుమతి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: పార్టీ నేతల సోషల్ మీడియాపై ఏఐసీసీ ఆరా!
Follow Us On: Instagram

