కలం, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) సంచలన లేఖ రాశారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టులో కేటాయింపులు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని లేఖలో రాసుకొచ్చారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు పనులను ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కేఎంవీ సంస్థకు ఇచ్చింది. అయితే కేఎంవీ సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సంచలన ఆరోపణలు చేశారు. కేవలం 20 శాతం పనులకు రూ.206 కోట్లు కేటాయించడం వెనుక భారీ అవినీతి (Gannavaram Contract Scam) జరిగిందని ఆరోపించారు. కేఎంవీ సంస్థ వల్లభనేని వంశీకి సన్నిహితుడని చెప్పుకొచ్చారు.
వెంకట్రావ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని, దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలని వల్లభనేని వంశీ డిమాండ్ చేశారు. కేఎంవీ సంస్థలకు పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని లేఖలో రాసుకొచ్చారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందంటూ చేసిన ఆరోపణల్లో సత్యం ఏమిటో, అసత్యం ఏమిటో తేల్చాలన్నారు. విచారణలో అవినీతి జరిగినట్లు వెల్లడైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ప్రమేయం ఉందని నిర్ధారణ జరిగితే తనపై కూడా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

