కలం, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లా ఎటపల్లి తాలూకాలో మావోయిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇనుప ఖనిజ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ రాసిన కరపత్రాలను జువేలి, పిప్లి, బుర్గి గ్రామాల్లో భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
‘అశోక్ కామ్రేడ్’ పేరుతో విడుదలైన ఈ కరపత్రాల్లో ఇనుప ఖనిజ కంపెనీలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవాలని మావోయిస్టులు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా ప్రతిపాదిస్తున్న మైనింగ్ ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తిగా నిలిపివేయాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. అలాగే గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్థులు మైనింగ్ కంపెనీలను వ్యతిరేకిస్తూ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆపరేషన్ కగార్ అనంతరం మావోయిస్టులు పూర్తిగా అంతమయ్యారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కరపత్రాలు వెలుగులోకి రావడం సంచనంగా మారింది. కరపత్రాలు గుర్తించడంతో గడ్చిరోలి (Gadchiroli)–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. అలాగే తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేసిన అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.
Read Also: సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన
Follow Us On: Sharechat

