కలం, వెబ్ డెస్క్ : శ్రీశైల భ్రమరాంబికా అమ్మవారికి ఓ భక్తుడు అరుదైన పట్టుచీర సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు (Sircilla Weaver) నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను అమ్మవారికి సమర్పించారు. ఈ ప్రత్యేక వస్త్రాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడుకి అందజేశారు.
ఈ సందర్భంగా చేనేత కళాకారుడు, విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తమ కుటుంబ సభ్యులతో కలసి వారం రోజుల్లో ఈ పట్టుచీరను మగ్గంపై నేసినట్లుగా తెలియజేశారు. మొత్తం 5.5 మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు కలిగిన ఈ పట్టుచీర బరువు 200 గ్రాముల వరకు ఉంటుందన్నారు. సంప్రదాయ “ఇక్కత్” నమూనాలో రూపొందించబడిన ఈ చీరను మడత పెట్టినప్పుడు చిన్న అగ్గిపెట్టెలో సులభంగా ఇమిడిపోతుందన్నారు. అమ్మవారి కృపతోనే ఈ అరుదైన వస్త్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.
దేవస్థానం తరపున ఈ ప్రత్యేక పట్టుచీరను స్వీకరించిన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు.. విజయ్ కుమార్ ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంప్రదాయమైన పట్టుచీర మన చేనేత కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. కళాకారుల సృజనాత్మక, నైపుణ్యం అంకిత భావాలకు చేనేత వస్త్రాలు ప్రతిరూపంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా వస్త్ర సమర్పణ చేసిన చేనేత కళాకారులు విజయ్ కుమార్ (Sircilla Weaver Vijay Kumar), వారి బృందానికి ప్రత్యేక దర్శనం కల్పించారు.
Read Also: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
Follow Us On : WhatsApp

