కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad) లోని కూకట్ పల్లి కేపీహెచ్‌బీ పరిధిలోని లులు మాల్ (Lulu Mall) లో గన్ కలకలం సృష్టించింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న KPHB పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెబుతుండగా.. పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి జేబులో గన్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన KPHB సీఐ రాజశేఖర్ రెడ్డి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో సిద్దిఖీ వద్ద ఉన్న గన్‌కు చట్టపరమైన లైసెన్స్ ఉన్నట్లు తేలింది. అయితే గన్‌తో వచ్చిన వ్యక్తిని మాల్‌లోకి అనుమతించే సమయంలో భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించలేదని గుర్తించిన పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన లులు మాల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

