కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణకు బంగారు బాతు లాంటి సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు లూటీ చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ చేపట్టిన ‘సింగరేణి భరోసా యాత్ర’లో(Singareni Bharosa Yatra) భాగంగా భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలలో నిర్వహించిన కార్మిక సదస్సులో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను నిలబెట్టారని, కానీ గత పాలకులు సంస్థ ఆదాయాన్ని తమ అవసరాలకు మళ్లించారని ఆరోపించారు. గతంలో సింగరేణి సంపదను సిద్దిపేటకు తరలిస్తే.. ఇప్పుడు కొడంగల్‌కు మళ్లిస్తున్నారని విమర్శించారు.తాను చేపట్టిన యాత్రలో రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదని, కేవలం కార్మికుల సంక్షేమం, సింగరేణి రక్షణ అంశాలపైనే దృష్టి పెడతానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇకపై సింగరేణిపై రాష్ట్ర ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు.
సింగరేణికి రూ.54 వేల కోట్ల బకాయిలు: కిషన్ రెడ్డి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణికి విద్యుత్, బొగ్గు కొనుగోళ్ల రూపంలో రూ.24 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు బకాయిలు పెట్టిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ బకాయిలను పెంచిందని, మొత్తం రూ.54 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ సింగరేణి నుంచి కొనుగోలు చేసే బొగ్గుకు ఎలాంటి బకాయిలు లేకుండా చెల్లింపులు చేస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కార్మికుల నిధులను వినియోగిస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ఆదాయం కార్మికులు, స్థానిక ప్రజలు, భూములు ఇచ్చిన రైతులు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు.
సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ గత పదేళ్లుగా బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్ర అభిప్రాయాన్ని తీసుకోలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణిలో అవినీతి జరిగిందని ఇప్పుడు మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర భాగస్వామ్యం ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు.
నైనీ, తాడిచర్ల బొగ్గు బ్లాకులతో కొత్త ఆదాయం
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ అనుమతులను ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సాధించామని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే వేలం లేకుండా తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సింగరేణికి వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని, సంస్థకు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. సింగరేణి ప్రాంత భవిష్యత్తు, కార్మికుల హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

