కలం, క్రైమ్ బ్యూరో : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనూ గంజాయి (Private Travels Bus Ganja) రవాణా జరుగుతుంది. డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కు కమీషన్ ఇచ్చి ముఠాలు తమ దందాను సాగిస్తున్నాయి. బస్సు లగేజీ పేరుతో గంజాయి బస్తాలను హైదరాబాద్ (Hyderabad) కు చేరవేస్తున్నాయి. ఈ విషయాన్ని ఈగల్ ఫోర్స్ గుర్తించింది. తాజాగా చేసిన ‘బాబా భోలానాథ్ ట్రావెల్స్’ బస్సులో తనిఖీలు చేసి గుట్టును రట్టు చేశాయి. డ్రైవర్, కండక్టర్, హెల్పర్ కు గంజాయి ముఠాలు కమీషన్ ఇచ్చినట్లు తేలింది. ఆ బస్సు నుంచి 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 20 లక్షల పైనే ఉంటుందని ఈగల్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని ఒడిశాలో లోడ్ చేశారని, పంపించిన వ్యక్తి వివరాలు, ఇక్కడ రిసీవ్ చేసుకోవాల్సిన వ్యక్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదని పోలీసులు తెలిపారు. ముగ్గురూ గంజాయి రవాణాలో కుమ్మక్కయ్యారని చెప్పారు. రవాణా చేసిన ‘బాబా భోలానాథ్ ట్రావెల్స్’ బస్సును సీజ్ చేశామని ఈగల్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. పట్టుబడ్డ ముగ్గురి నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

