కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. రానున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థలు, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దీంతో జిల్లాలో రాజకీయ వేడి పెరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు కొనసాగుతుండగా, తెలంగాణ రక్షణ సేన (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత (Kavitha) కూడా తన రాజకీయ కార్యాచరణను వేగవంతం చేస్తూ కొత్త చర్చకు తెరలేపుతున్నారు.
సింగరేణిపై కవిత ప్రత్యేక దృష్టి
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలో సింగరేణి (Singareni) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో కార్మికులను లక్ష్యంగా చేసుకుని కవిత వరుసగా క్షేత్రస్థాయి పర్యటనలు చేపడుతున్నారు. సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు ప్రాంతాలలో నిర్వహించిన ‘బాయి బాట’ కార్యక్రమాల ద్వారా కార్మిక సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సంప్రదాయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. కార్మిక హక్కులను విస్మరించి అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన నాయకత్వంపై ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు కోల్‌బెల్ట్ ప్రాంతంలో రాజకీయ చర్చకు దారితీశాయి.
అదేవిధంగా, సింగరేణిలో పెండింగ్‌లో ఉన్న సుమారు 3 వేల డిపెండెంట్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. దీంతో కార్మిక సమస్యలను ప్రధాన రాజకీయ అజెండాగా మార్చేందుకు కవిత ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం వ్యాఖ్యలకు పువ్వాడ భావోద్వేగ స్పందన
ఇటీవల చింతకాని మండలంలో జరిగిన ‘రైతు ఆశీర్వాద సభ’లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా జిల్లా రాజకీయాలలో చర్చకు దారితీశాయి. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన భావోద్వేగంగా స్పందించారు. మూడు దశాబ్దాల క్రితం జరిగిన ప్రమాదంలో తాను ఒక కన్ను కోల్పోయానని, దాన్ని ఎప్పుడూ దాచలేదని పేర్కొన్నారు. ప్రజలు తన శారీరక లోపాన్ని కాకుండా పనితీరును చూసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తు చేశారు.
“నాకున్న ఒక్క కన్నుతోనే రాత్రింబవళ్లు పనిచేసి జిల్లాను అభివృద్ధి చేశాను. ఇప్పుడు జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆ ఆరు కళ్లు కలిసి నేను చేసిన అభివృద్ధిలో కనీసం పదోవంతైనా చేశాయా?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వ్యక్తిగత విమర్శలు చేస్తోందని ఆరోపించారు.
త్రిముఖ పోరుకు దారితీస్తున్న రాజకీయాలు
ఒకవైపు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలతో తిరిగి బలపడేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో సింగరేణి కార్మికులు, డిపెండెంట్ ఉద్యోగాలు వంటి అంశాలతో కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య పోటీని దాటి త్రిముఖ రాజకీయ పోరుగా మారుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు, సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలు ఈ రాజకీయ సమీకరణాలపై ఎంత ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రాజెక్టులపై మళ్లీ రాజకీయ విమర్శలు
సాగునీటి ప్రాజెక్టుల అంశం కూడా జిల్లాలో రాజకీయ వేడిని పెంచుతోంది. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనం కలగకుండా చేయాలనే ఉద్దేశంతో గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని విమర్శిస్తోంది. అలాగే, భద్రాచలానికి ముప్పు మేడిగడ్డ వల్ల కాదని, పోలవరం ప్రాజెక్టు ప్రభావమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ పేర్కొంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ ఈ అంశాలను ప్రజలలోకి తీసుకెళ్తోంది.

