అంగన్‌వాడీల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం: సాబీర్ పాషా

​కలం, ఖమ్మం బ్యూరో: అంగన్‌వాడీల న్యాయమైన హక్కుల సాధనకు రాజీలేని పోరాటాలే శరణ్యమని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా స్పష్టం చేశారు. చాలీచాలని వేతనాలిస్తూ, మోయలేని పనిభారంతో ప్రభుత్వం అంగన్‌వాడీలను బానిసలుగా చూస్తోందని ఆయన విమర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండు రోజుల పాదయాత్రను ఆదివారం భద్రాచలంలో (Bhadrachalam) కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్యం వీరుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఎర్రజెండాల నినాదాలతో భద్రాచలం పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

​అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణులకు సేవలందిస్తున్న అంగన్వాడీలపై అదనపు విధులు మోపడం వెట్టిచాకిరీ చేయించడమేనన్నారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నెలకు రూ. 18 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఐసీడీఎస్‌కు తగిన బడ్జెట్ కేటాయించాలన్నారు. సమస్యల పరిష్కారంలో కాలయాపన చేస్తే వేలాది మందితో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

​ప్రజల సంఘీభావంతో ఉత్సాహంగా సాగిన ఈ పాదయాత్ర తొలిరోజు భద్రాచలం నుండి సారపాక, బూర్గంపాడు మీదుగా పాల్వంచ మండలంలోని జగన్నాధపురం వరకు చేరింది. రెండవ రోజైన సోమవారం జగన్నాధపురం పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి కలెక్టరేట్ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. అనంతరం అక్కడ భారీ ధర్నా నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు సాయి ఈశ్వరి, కార్యదర్శి నండూరి కరుణకుమారి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శులు సింగు నరసింహారావు, నరాటి ప్రసాద్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>