చితిపై కదిలిన ‘శవం’.. ప్రైవేట్ డాక్టర్ల నిర్వాకం.. అంత్యక్రియల వేళ మిరాకిల్!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందో చెప్పడానికి నిదర్శనంగా ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగుచూసింది. మనిషి ప్రాణాలతో బ్రతికుండగానే, చనిపోయాడంటూ నిర్ధారించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ​మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ధారావత్ మధుసూదన్‌రావు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేర్పించినప్పటి నుండి బ్రెయిన్ సర్జరీ చేయాలని, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించాలని చెబుతూ వైద్యులు బాధితుల నుండి దాదాపు రూ. 3 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారు.

అయితే, శనివారం నాడు ఆ యువకుడి పరిస్థితి విషమించిందని, ఆయన మరణించారంటూ వైద్యులు తేల్చి చెప్పేసి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు.. అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని, మృతదేహాన్ని ఇంటికి తరలించారు. అయితే, అంత్యక్రియలు నిర్వహించడానికి కొద్దిసేపటి ముందు ఒక అద్భుతం జరిగింది. సదరు యువకుడి శరీరంలో కదలికలు రావడం, శ్వాస తీసుకోవడం గమనించిన బంధువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మనిషి బ్రతికే ఉన్నాడని గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం మళ్లీ ఆసుపత్రికి తరలించారు.

​బాధ్యతాయుతమైన వైద్య వృత్తిలో ఉంటూ, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం.. కనీస పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించకుండా మనిషి బ్రతికుండగానే చనిపోయాడని ప్రకటించడంపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యపూరిత తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>