ఖమ్మం పల్లెల్లో ప్రగతి జోరు.. పొంగులేటి విస్తృత పర్యటన!​

కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకూ పారదర్శకంగా అందిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. సుమారు రూ. 4.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ సాయాన్ని అందజేశారు.​ఈ పర్యటనలో భాగంగా ఖమ్మం రూరల్ మండలం ఆరేకోడు గ్రామంలో రూ. 2.24 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి, 20 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.

అనంతరం తిరుమలాయపాలెం మండలం రమణ తండాలో రూ. 1.94 కోట్లతో నిర్మించనున్న లింక్ రోడ్డు పనులకు, కొక్కిరేణి గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ భవనానికి ఆయన శంకుస్థాపనలు చేశారు.​మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 19 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, అలాగే అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 77 మందికి రూ. 24.67 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదని, నిధుల కొరత లేనందున కాంట్రాక్టర్లు నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>