కలం, వెబ్ డెస్క్: ఓ దశలో ఓటమి ఖాయమనిపించింది. కానీ చివర్లో సుతీర్థ ముఖర్జీ (Sutirtha Mukherjee) అద్భుత ఆటతో దబాంగ్ ఢిల్లీ టీటీసీ అద్భుతంగా పుంజుకుంది. అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (UTT) సీజన్-7లో హెచ్‌వీఆర్ కోల్‌కతా థండర్బ్లేడ్స్పై 8-7తో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ఈ సీజన్లో తన అజేయ రికార్డును కొనసాగించింది. పోటీ ఆరంభంలో ఈజిప్ట్ ఆటగాడు యూసెఫ్ అబ్దెల్అజీజ్ 2-1తో ఎడ్వర్డ్ ఐయోనెస్కూను ఓడించి ఢిల్లీకి ఆధిక్యం అందించాడు. వెంటనే సింగపూర్ స్టార్ జెంగ్ జియన్ 2-1తో మారియా షియావోను ఓడించి కోల్‌కతాను సమం చేసింది.
మిక్స్డ్ డబుల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్-మారియా షియావో జోడీ 2-1తో గెలిచి ఢిల్లీకి మళ్లీ ఆధిక్యం తీసుకొచ్చింది. అయితే అసలు మలుపు పురుషుల సింగిల్స్‌లో వచ్చింది. యువ ఆటగాడు అంకుర్ భట్టాచార్జీ సంచలన ఆటతో సత్యన్‌ను వరుసగా మూడు గేమ్‌ల్లో ఓడించాడు. ఈ విజయంతో కోల్‌కతా గెలుపు అంచుల వరకు చేరుకుంది. చివరి మ్యాచ్‌లో ఒక్క గేమ్ గెలిస్తే చాలు అనే స్థితికి వచ్చింది.
అలాంటి ఒత్తిడిలో సుతీర్థ ముఖర్జీ అసాధారణ ఆటను ప్రదర్శించింది. తన డబుల్స్ భాగస్వామి అయ్హికా ముఖర్జీపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుసగా మూడు గేమ్‌లు గెలిచి ఢిల్లీకి 8-7తో చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో నిర్ణయాత్మక ప్రదర్శన చేసిన సుతీర్థకు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది టై అవార్డు దక్కింది. అంకుర్ భట్టాచార్జీ ప్లేయర్ ఆఫ్ ది టై, షాట్ ఆఫ్ ది టై అవార్డులు గెలుచుకున్నాడు.
జెంగ్ జియన్ ఫారిన్ ప్లేయర్ ఆఫ్ ది టైగా నిలిచింది. ఇక డ్రీమ్ UTT జూనియర్స్ విభాగంలో యూ ముంబా టీటీ 7-2తో పీబీజీ పుణె జాగ్వార్స్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో డెంపో గోవా చాలెంజర్స్ 5-4తో యూపీ ప్రోమీథియన్స్కు ఈ సీజన్లో తొలి ఓటమి రుచి చూపించింది.

