కలం, వెబ్ డెస్క్: అఫ్ఘానిస్థాన్ మహిళా శరణార్థుల క్రికెట్ జట్టుకు (Afghan Women Cricketers) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి మరోసారి పెద్ద ఊరట లభించనుంది. ఈ జట్టుకు నిధుల మద్దతును కొనసాగించేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. శనివారం జరగబోయే ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై కీలక చర్చ జరగనుంది. దీనికి బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డులు కూడా మద్దతు తెలపడం విశేషం. ఈ కథనానికి సంబంధించిన నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే.. 2021లో అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి మహిళా క్రికెటర్లు దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.
అలా ఇబ్బందుల్లో పడిన క్రీడాకారిణుల కోసం గత ఏడాది ఐసీసీ ఒక ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో నివసిస్తూ, అక్కడే శిక్షణ పొందుతూ స్థానిక క్రికెట్ ఆడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ నిధుల సహాయాన్ని 2032 వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు, తమను అధికారిక అంతర్జాతీయ జట్టుగా గుర్తించాలని అఫ్ఘాన్ మహిళా ఆటగాళ్లు ఐసీసీని కోరారు.
దీనిపై ఐసీసీ మహిళా క్రికెట్ కమిటీ చైర్ క్లేర్ కానర్ సమర్పించిన ప్రతిపాదనను కూడా శనివారం నాటి సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రతిపాదన ఓకే అయితే, వారు అధికారిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే, ప్రస్తుత అఫ్ఘానిస్థాన్ పరిస్థితులు, అలాగే అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డ్‌తో ఐసీసీకి ఉన్న సంబంధాల దృష్ట్యా ఈ సమస్య అంత సులభంగా తేలేలా కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే, ఇటీవల జూలై 5న లార్డ్స్‌లో జరిగిన మహిళా టీ20 ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా అఫ్ఘాన్ మహిళా క్రీడాకారిణులు ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు ఇతర అధికారులను కలిసి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఐసీసీ తన టాస్క్ ఫోర్స్‌లో ఒక మహిళా ప్రతినిధిని చేర్చింది. అలాగే భవిష్యత్తు చర్చల్లో క్రీడాకారిణుల గొంతుకను వినిపించడానికి ‘పిచ్ అవర్ ఫ్యూచర్’ ప్రచారాన్ని కూడా చేర్చాలని యోచిస్తోంది.

