బధిర ఉద్యోగులకు వినికిడిలో లోపం మాత్రమే.. సేవాభావంలో కాదు: దారం

కలం, కరీంనగర్: తెలంగాణ ఎన్జీవోల సంఘం (TNGOs) అనుబంధంగా ఏర్పాటైన మాట వినికిడి లోపం (బధిర) ఉద్యోగుల రాష్ట్ర సంఘం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 10వ వార్షికోత్సవ (వసంతోత్సవ) వేడుకలు కరీంనగర్ జిల్లా టీఎన్జీవో కమ్యూనిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు అనిల్, జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బధిర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, బధిర ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు రమణారావు, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగేమ్ లక్ష్మణ్ రావు, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 33 జిల్లాల నుంచి విచ్చేసిన అధ్యక్షులు, కార్యదర్శులను, వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బధిర ఉద్యోగులను రాష్ట్ర కార్యవర్గం ఘనంగా సన్మానించింది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. “బధిర ఉద్యోగులకు వినికిడిలో మాత్రమే లోపం ఉంటుంది గానీ వారి ఆలోచనలో, ఆత్మవిశ్వాసంలో, సేవాభావంలో, క్రమశిక్షణలో, నిజాయితీలో, ప్రతిభలో ఎలాంటి లోపం ఉండదు” అని అన్నారు. హెల్మెట్ తయారీ నుంచి సామాజిక సేవ వరకు, డ్రైవింగ్ లైసెన్సుల సాధన నుంచి సాంకేతిక నైపుణ్యాల వరకు అనేక రంగాల్లో బధిర ఉద్యోగులు తమ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. సమాజం వారిని జాలితో కాక, గౌరవంతో చూడాలని, వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా ప్రతి శాఖ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారి చిరునవ్వుల్లో ఆత్మవిశ్వాసం, వారి పనితీరులో అంకితభావం, వారి జీవితంలో పోరాటస్ఫూర్తి ప్రతి ఉద్యోగికి ఆదర్శమని పేర్కొన్నారు.

బధిర ఉద్యోగులు ఎదుర్కొంటున్న సంక్షేమ, పదోన్నతులు, బదిలీలు, శాఖాపరమైన పరీక్షల మినహాయింపు, సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు తదితర సమస్యలను రాష్ట్ర టీఎన్జీవోల అధ్యక్షుడు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు సంఘం నిరంతరం పోరాడుతుందని దారం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో మాట వినికిడి, శారీరక, దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు కోరుకున్న ప్రాంతాల్లో బదిలీలు కల్పించేలా జీవో జారీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తితో బధిర ఉద్యోగుల న్యాయమైన ప్రతి డిమాండ్‌ను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బధిర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారావు, టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంగేమ్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ.. బధిర ఉద్యోగులకు టీఎన్జీవోల సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి అన్ని స్థాయిల్లో కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు శక్తి, సంతోష్, బాబు జాన్ చల్ల రాములు, క్రాంతి ప్రసాద్, తిరుపతయ్య, సోహియా, ప్రణతితో పాటు రాజా వీర్ రెడ్డి, కీర్తి, చైతన్య, రోహిత్ రెడ్డి, సురేష్, మహేష్, ఆంజనేయులు, దేవయ్య, లక్ష్మయ్య, చిన్నయ్య, ధనరాజ్ తదితర రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, బధిర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>