కలం, కరీంనగర్: వివిధ మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం అయ మిల్లులలో లేకపోవడాన్ని గుర్తించిన సివిల్ సప్లయి అధికారుల దోషులపైన చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకడుగు వేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని తెలంగాణ రక్షణ సేన (TRS) కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ (Gunjapadugu Hariprasad) డిమాండ్ చేశారు. ఒకరిద్దరి మీద కేసులు పెట్టి అసలైన తిమింగులాలను కాపాడుతున్నారని మండిపడ్డారు. ఇది వరకే నిషేధిత జాబితాలో ఉన్న మిల్లర్లకు తిరిగి మళ్ళీ ధాన్యం కేటాయింపులు చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం వారికే మళ్ళీ ధాన్యం కేటాయింపులు చేయడంలో అర్దం ఏముందో ప్రభుత్వం చెప్పాలి? అని ప్రశ్నించారు.
దోషులను ప్రభుత్వం కాపాడుతోంది..
ఈ సీజన్‌లో కూడ నిషేధిత మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేసి ఇదివరకే వందల కోట్ల బకాయిలు ఉన్న వారిని ఈ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. తద్వారా ప్రభుత్వానికి ఏం లబ్ధి చేకూరుతుందో అధికారులు ప్రజలకు చెప్పాలన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ మిల్లుల నుంచి దాదాపు 7 నుంచి 8 వందల కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉందని చెప్పారు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ వారందరినీ వదిలి పెట్టి కేవలం ఒక వర్గానికి చెందిన ఒకరిద్దరిపైన నామమాత్రపు కేసులు పేట్టి పందికొక్కులా.. ప్రజలకు సరఫరా చేసే బియ్యాన్ని దొబ్బితిన్న వ్యాపారులను ఎందుకు వదిలి పెడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు సమాధానం చెప్పాలి..
జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్‌లో భారీ అవినీతి అక్రమాలు, కుంభకోణాల మీద ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. లేనియెడల తెలంగాణ రక్షణ సేన సివిల్ సప్లయ్ కార్యలయం ముందు రైతులతో, ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సివిల్ సప్లాయ్ కార్పొరేషన్‌లో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ఈ ప్రభుత్వం, అధికారులు కాపాడుతున్నారని.. వారు ఇచ్చే డబ్బు సంచులకు ప్రభుత్వ పెద్దలు అండదండలు అందిస్తున్నారని ఆరోపించారు. ఈ దోపిడీపై ప్రభుత్వం ఇప్పటికైన చర్యలు చేపట్టాలని అన్నారు.
తిమింగలాలను వదిలేస్తున్నారు..
పీడీ యాక్ట్ లు కొందరి కోసం కాదని.. ఇది అందరికీ ఉండాలని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఒకరిద్దరి మీద, అదికూడా ఒక వర్గానికి చెందిన వారి మీద పెట్టి ప్రభుత్వం కంటి తుడుపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. దర్యాప్తు సంస్థల కళ్లు కప్పి వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం బకాయిలు ఎగ్గొట్టిన బడా మిల్లర్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇది కేవలం చిన్న చేపలను పట్టి తిమింగలాలను వదిలేసే కుట్రలో భాగమేనని ఆరోపించారు.
వందల కోట్లు దోచుకున్నారు..
ఈ దోపిడీలో ప్రభుత్వ పెద్దలు అండదండలతోపాటు అధికారులు, ప్రతిపక్షాల నాయకులు కుమ్మక్కవడంతోనే వందల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో అక్రమాలు రుజువైన మిల్లర్లకు మళ్లీ ధాన్యం కేటాయింపులు చేయడం వెనుక ఉన్న మతలబేంటో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సన్న బియ్యం పంపిణీకి ముందు, మిగిలిన దొడ్డు బియ్యం వేలం ప్రక్రియలో కూడ వందల కోట్ల రూపాయల భారీ కుంభకోణం పెద్దఎత్తున జరిగిందని ఆరోపించారు. దానిని సంబంధించిన వివరాలు కూడ త్వరలోనే బయట పెడుతామని గుంజపడుగు హెచ్చరించారు.

