కలం, మెదక్ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి కొంచెమైనా నైతిక విలువలు ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
షాబాద్‌లో జరిగిన ఘటనపై సిద్దిపేటలో హరీశ్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. షాబాద్‌లో జరిగిన ఆరుగురి హత్యలు ముమ్మాటికీ పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ తప్పిదాల వల్లే జరిగాయన్నారు. వీటిని ‘ప్రభుత్వ హత్యలు’గా పరిగణించాలని, ఇంత తీవ్రమైన సంఘటన జరిగితే సీఎంకు కనీసం మానవత్వం ఉందా? అని ప్రశ్నించారు. ఇంత వరకు సంఘటనా స్థలానికి వెళ్లాల్సిన బాధ్యత సీఎంకు లేదా అని నిలదీశారు.
గతంలో అత్యాచారానికి గురైన బాధితురాలి తల్లి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని, అప్పుడు అత్యాచారం జరిగిన సమయంలోనూ, ఇప్పుడు దారుణంగా హత్యలు చేసిన తర్వాత కూడా నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఇంత పెద్ద దారుణం జరిగినా ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని, బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు.
హత్య చేసిన నిందితుడిని పట్టుకోవడం చేతకాని పోలీసులు బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులను మాత్రం వెంటాడి, వేటాడి అరెస్టులు చేస్తున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: రాష్ట్రంలో ఇదే పెద్ద సమస్య: సీఎం రేవంత్
Follow Us On: X(Twitter)

