కలం, ఖమ్మం బ్యూరో: చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల (Anganwadi Workers)పై అదనపు పనుల భారం మోపుతూ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించడం దారుణమని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాటి ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం భద్రాచలంలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వేళ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహార పంపిణీని పర్యవేక్షించాల్సిన అంగన్వాడీలను ఓటరు జాబితాల సవరణ, ఇంటింటి సర్వేల వంటి బీఎల్ఓ విధుల పేరుతో వీధుల వెంట తిప్పడం వల్ల కేంద్రాల నిర్వహణ పూర్తిగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, వారిని బీఎల్ఓ విధుల నుంచి తక్షణమే మినహాయించాలని డిమాండ్ చేశారు.
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు రూ.18 వేల వేతనం అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. అలాగే కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా నేటి నుంచే క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించిన ఆయన.. ఇప్పటికైనా పాలకులు మొద్దునిద్ర వీడి స్పందించకపోతే ఈ ఆగ్రహం ఉద్యమ ఉప్పెనగా మారుతుందని, రాష్ట్రవ్యాప్తంగా బలమైన పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ (AITUC), సీపీఐ నాయకులు కంచర్ల జమలయ్య, గోనె మణి, కల్లూరు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: పీసీసీ చీఫ్ సెగ్మెంట్.. సర్ ప్రక్రియతో జాగ్రత్త!
Follow Us On: X(Twitter)

