కలం, వెబ్ డెస్క్: మోటార్లకు మీటర్ల (Power Meter Plan)పై గత కొంతకాలంగా రాష్ట్రంలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై అటు ప్రతిపక్షాలు సైతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మోటార్లకు మీటర్లు ఉండవని క్లారిటీ ఇచ్చింది. రైతు డిస్కం ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు TGRPDCL కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లైసెన్స్ జారీ చేసింది. నాలుగు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని సూచించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తూనే, మోటర్లకు ఎలాంటి మీటర్లు ఉండవని ఈఆర్‌సీ తేల్చి చెప్పింది.
రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా ఈ విధానంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అలాగే వ్యక్తిగత వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా ఉత్తర్వుల్లో నమోదు చేసింది. TGRPDCL కూడా ఇతర డిస్కంల మాదిరిగానే టారిఫ్, సేవా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులు, నివేదికల సమర్పణ తదితర అన్ని అంశాల్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి పర్యవేక్షణలో పని చేస్తుందని స్పష్టం చేసింది.
రైతు విద్యుత్ పంపిణీ సంస్థ లైసెన్స్ మంజూరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (TGRPDCL)కు శనివారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (TGERC) విద్యుత్ పంపిణీ లైసెన్స్ మంజూరు చేసింది. ఉగాది పర్వదినానం మార్చ్ 19 న TGRPDCL లైసెన్స్ కోసం TGERC కి దరఖాస్తు చేసింది. ఈ లైసెన్స్ దరఖాస్తు పై మే 29 న బహిరంగ విచారణ నిర్వహించిన ERC, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వినియోగదారుల సంస్థలు, విద్యుత్ రంగ నిపుణులు తమ అభ్యంతరాలు, సూచనలను పరిశీలించి, అందిన అన్ని అభిప్రాయాలను అంశాల వారీగా పరిగణనలోకి తీసుకుని కమిషన్ తన ఉత్తర్వుల్లో సమాధానాలు ఇచ్చింది. O.P. No.11 of 2026, O.P. No.14 of 2026 మరియు O.P. No.15 of 2026లపై ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేస్తూ, విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం కు లైసెన్స్ మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొత్త డిస్కం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు, మిషన్ భగీరథ/సంయుక్త రక్షిత తాగునీటి పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB), అలాగే ప్రత్యేక పంపిణీ ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ పొందుతున్న మున్సిపల్ తాగునీటి కనెక్షన్లకు సేవలు అందించనుంది. ఈ ఉత్తర్వు తేదీ నుంచి నాలుగు నెలల తర్వాత TGRPDCL వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యే తేదీగా కమిషన్ ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టంలోని సెక్షన్ 131 ప్రకారం చట్టబద్ధమైన ట్రాన్స్ఫర్ స్కీమ్ ను జారీ చేసిన తర్వాతే లైసెన్స్ అమల్లోకి వస్తుంది.
విద్యుత్ చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం TGSPDCL, TGNPDCL దాఖలు చేసిన దరఖాస్తులను కూడా కమిషన్ ఆమోదించింది. TGRPDCL కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుంచి బదిలీ అయ్యే వినియోగదారుల వర్గాలను ఈ రెండు డిస్కంల పరిధి నుంచి తొలగిస్తూ వాటి లైసెన్సులను సవరించింది. మిగతా వినియోగదారులకు సేవలు అందించే బాధ్యతలు, భౌగోళిక పరిధిలో ఎలాంటి మార్పు ఉండదు. మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా కమిషన్ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.
TGRPDCL కూడా ఇతర డిస్కంల మాదిరిగానే టారిఫ్, సేవా ప్రమాణాలు, వినియోగదారుల హక్కులు, నివేదికల సమర్పణ తదితర అన్ని అంశాల్లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి పర్యవేక్షణలో పనిచేస్తుంది. మార్పిడి ప్రక్రియను కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే ప్రజాహిత దృష్ట్యా మరిన్ని ఆదేశాలు జారీ చేస్తుంది.
Read Also: హరీశ్ అత్యంత అవినీతిపరుడు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

