కలం, వెబ్ డెస్క్: వియత్నాం (Vietnam) లోని హాలాంగ్ బేలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. లావా మొబైల్ సక్సెస్ మీట్ కోసం వెళ్లిన టూరిస్టులతో సముద్రంలోకి వెళ్లిన ఓ బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాద సమయంలో బోటులో 32 మంది టూరిస్టులతో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంపై ఏపీలోని బాధిత కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇప్పటికే ప్రమాదం నుంచి బయటపడ్డ మరికొంత మంది టూరిస్టులు రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయం కోసం సంప్రదించారు. ఈ బోటు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వాసుల్లో ఎక్కువ మంది సెల్‌ఫోన్ డీలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కడపకు చెందిన డీలర్ శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

