కలం, ఖమ్మం బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పక్కనబెట్టి, శారీరక లోపాలను కించపరచడమే ఎజెండాగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోదా మరిచి ‘కన్ను లేదు’ అంటూ రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన ప్రమాదంలో తాను కన్ను కోల్పోయినప్పటికీ, ఉన్న ఒక్క కన్నుతోనే ఖమ్మం జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేశానని, గోదావరి వరదలను సైతం పకడ్బందీగా సమీక్షించానని గుర్తుచేశారు.
తాను ఒక్క కంటితో చేసిన అభివృద్ధిని, ఇప్పుడు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఆరు కళ్లతో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. తనపై విమర్శలు చేయడం ఆపి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి ఏ అంగవైకల్యం అడ్డు వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మరీ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని, మూడు సీజన్ల రైతు భరోసాతో పాటు 420 హామీల్లో దేన్నీ సరిగ్గా అమలు చేయలేదని ఆరోపించారు.
కాళేశ్వరంలో నీరు పారుతున్నా నీటిని విడుదల చేయకుండా రైతులను ముంచుతున్నారని ధ్వజమెత్తారు. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ శ్రమ ఫలితమేనని, తాము రూ. 9,000 కోట్లు ఖర్చు చేస్తే.. మంత్రి తుమ్మల ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారని విమర్శించారు. గోదావరి నీళ్లు వృథాగా పోతుంటే ఏపీలో చంద్రబాబు పట్టిసీమ ద్వారా ఎత్తిపోసుకుంటున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు తెలంగాణ ప్రయోజనాల పట్ల కనీస చిత్తశుద్ధి లేదని పువ్వాడ దుయ్యబట్టారు.

