కలం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షపుష్పార్చన ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సుప్రభాతంతో గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను మేల్కొలిపి పంచామృతాలతో నిజాభిషేకం జరిపించారు.
అనంతరం తులసి దళాలతో సహస్ర నామార్చనలు చేసి ప్రధాన ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో, ముత్యాల తళంబ్రాలతో, బంగారు ఆభరణాలతో దివ్య మనోహరంగా బంగారు సింహాసనంపై అలంకరించారు. అనంతరం అర్చక బృందం, వేద పండితులు.. స్వామి, అమ్మవార్లను సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.
రెండు గంటల పాటు అర్చన కొనసాగింది. అనంతరం ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలో సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనుబంధ శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యపూజలు, యాగశాలలో రుద్రహవనం శైవాగమ పద్ధతిలో నిర్వహించారు.

