హాట్ టాపిక్.. కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారిన ‘ఇంటి పోరు’!

కలం, తెలంగాణ బ్యూరో : “అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కండి. ‘సర్’తో ఓటర్ల పేర్లు గల్లంతు కాకుండా చూసుకోండి. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులను జనంలోకి తీసుకెళ్లండి..” అంటూ అధిష్టానం ఎంత మొత్తుకుంటున్నా జిల్లా నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ (TG Congress) లో ‘ఇంటి పోరు’ ఆ పార్టీ అధినాయకత్వానికి తీవ్ర తలనొప్పింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, రోడ్లెక్కి రచ్చ చేసుకోవడం ఇప్పుడు హస్తం పార్టీలో కామన్ అయిపోయింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిన అధికార పార్టీ.. ఇప్పుడు సొంత నేతల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరును సర్దుమణిగించడానికే ఫోకస్ పెట్టాల్సి వస్తున్నది.

పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ స్టేట్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. ఎంత చెప్పినా నాయకుల మధ్య ‘పొలిటికల్ వార్’ కంటిన్యూ అవుతూనే ఉంది. మంత్రులకు, జిల్లా పార్టీ అధ్యక్షులకూ పొసగడంలేదు. ప్రత్యర్థితో విమర్శల కంటే ‘ఇంటి పోరే’ కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నది. చివరికి ఇది ప్రభుత్వంపైనే నెగెటివ్ ఇమేజ్‌కు దారితీస్తున్నది.

కామారెడ్డి జిల్లాలో షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్‌రెడ్డి.. నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాష్‌.. అదే జిల్లా తుంగతుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేలు వర్సెస్ స్థానిక నేతలు..కొన్నాళ్లుగా వీళ్ల పంచాయితీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. ఇది ఇంకా కొనసాగుతుండగానే తాజాగా వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి కడియం శ్రీహరి వర్సెస్ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఉన్నత స్థానంలో ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సీనియర్లే వివాదానికి సెంటర్ పాయింట్లుగా మారుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుకో చోట పుట్టుకొస్తున్న పార్టీలోని ఇలాంటి వివాదాలను పరిష్కరించడం కాంగ్రెస్ పెద్దలకు టాస్క్‌గా మారుతున్నది.

ప్రధాన ప్రత్యర్థి.. సొంత పార్టీనే!

‘‘అసలు సమస్య ప్రతిపక్షం కాదు… సొంత నాయకుల మధ్య ఆధిపత్య పోరు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ‘ఇంటి పోరు’ మొదలైంది. నేతల మధ్య వ్యక్తిగత విభేదాలు.. జిల్లాపై ఆధిపత్యం కోసం గ్రూపు తగాదాలు.. పార్టీలో పెత్తనం కోసం కుమ్ములాటలు.. రోజుకో దగ్గర పంచాయితీలు కామన్ అయ్యాయి. ఎప్పుడు పరిష్కారమవుతాయో..” అని కాంగ్రెస్‌లోని పలువురు సిన్సియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పంచాయితీల పరిష్కారం మీదనే రాష్ట్ర నాయకత్వం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తున్నది. పవర్‌లోకి వచ్చిన తొలి ఏడాది సంక్షేమ పథకాలు, పాలనపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు ‘అంతర్గత సంక్షోభం’ సవాల్‌ను ఎదుర్కొంటున్నది. ప్రతిపక్షం నుంచి ఎదురవుతున్న సమస్యలకంటే సొంత పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, ఆధిపత్య పోరు, వర్గ విభేదాలే సమస్యాత్మకంగా మారాయి. జిల్లాలో బయటపడుతున్న ఈ అంతర్గత వివాదాలు ఇప్పుడు జిల్లా స్థాయి దాటి గాంధీభవన్, ఢిల్లీ హైకమాండ్ వరకు చేరుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా నేతల మధ్య సమన్వయం లేకపోవడం కాంగ్రెస్‌కు రాజకీయంగా ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నది.

సీనియర్లలోనూ భేదాభిప్రాయాలు

‘‘పార్టీ, ప్రభుత్వం రైలు పట్టాల్లా ఉండాలి… ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పార్టీ నాయకులు, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి… పార్టీ కోసం పనిచేస్తున్నవారికి ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలి’’… ఇలాంటివన్నీ తరచూ ముఖ్యమంత్రి నుంచి, పీసీసీ చీఫ్ నుంచి వింటున్న మాటలు. కానీ దానికి భిన్నంగా మాజీ మంత్రులు, సీనియర్లు సైతం విభేదాలను పరిష్కరించడానికి బదులు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ సైతం కామారెడ్డి జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత చంద్రశేఖర్రెడ్డితో విభేదించారు. ఇక నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్‌కు మధ్య సమన్వయం, సుహృద్భావ వాతావరణం లేదు. అదే జిల్లా తుంగతుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామేల్ కు, నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య గ్యాప్ వచ్చింది. అది రోడ్డెక్కి ఘర్షణ వాతావరణంగా మారింది. తాజాగా వరంగల్ జిల్లాలో మాజీ మంత్రి కడియం శ్రీహరి, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ మధ్య పంచాయితీ మొదలైంది.

ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేదెవరు?

“కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. గ్రూపులు లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది?..” ఈ మాటలు కూడా కాంగ్రెస్ నేతల నుంచే వస్తుంటాయి. వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమంటూ ముఖ్యమంత్రి ధీమాతో చెప్తున్నారు. కానీ, జిల్లాల్లోని పార్టీ అంతర్గత సమస్యలు సొంత మనుషులనే ఓడిస్తారేమో అనే వైపు దారి తీస్తున్నాయి. ‘ఒరిజినల్’, ‘వలస’ అనే తేడాలతో నియోజకవర్గాల్లో గ్రూపులు పెరిగిపోయాయి. ఈ వాతావరణమే అనేక చోట్ల ఘర్షణలకు కారణమవుతున్నదని పీసీసీ వర్గాల నుంచి వాదన వినిపిస్తోంది. దీంతో నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్ పోస్టులు, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు, ఇలాంటివాటిలో ఆ గ్రూపుల ఆధిపత్యం వ్యక్తమవుతున్నది.

మరోవైపు ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చి, సంక్షేమ పథకాలపై జనంలో విస్తృత అవగాహన కల్పించి.. మళ్లీ అధికారంలోకి రావాలన్న లక్ష్యానికి సొంత పార్టీలోని అంతర్గత విభేదాలు ఆటంకంగా మారుతున్నాయని కొందరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ నేతలే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే.. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేది ఎవరని వారు అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్‌లోని ఇంటి పోరు ప్రస్తుతం ప్రతిపక్షాలకు పాజిటివ్‌గా మారుతుందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>