Mobile Popup Ad
Mobile Popup Ad

‘ప్రైడ్ ఆఫ్ మహబూబ్‌నగర్’ గా IIIT క్యాంపస్ : ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ లో ప్రతిపాదిత IIIT క్యాంపస్ (Mahabubnagar IIIT) నిర్మాణానికి సంబంధించి రూపొందించిన సైట్ లేఅవుట్ ప్లాన్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, TGEWIDC మేనేజింగ్ డైరెక్టర్ ఘనపతి రెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీ, అధికారులతో కలిసి పరిశీలించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGEWIDC) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ను సమగ్రంగా రూపకల్పన చేశారు.

IIIT కళాశాల క్యాంపస్ “ప్రైడ్ ఆఫ్ మహబూబ్ నగర్” గా ఉండనున్నదని , సుమారు 6 వేల మంది విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే యెన్నం తెలిపారు. మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో, 3.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్న ఈ IIIT క్యాంపస్, బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-44) సమీపంలో ఏర్పాటు చేయనుండటంతో రవాణా సౌకర్యం సులభంగా అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రాజెక్ట్‌లో భాగంగా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్స్, PUC భవనాలు నిర్మించనున్నారు. విద్యార్థుల వసతి కోసం బాలురు, బాలికలకై వేర్వేరు హాస్టల్ భవనాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కిచెన్ అండ్ డైనింగ్ హాళ్లు, సూపర్ మార్కెట్, హెల్త్ కేర్ సెంటర్, సెక్యూరిటీ బ్లాక్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లైబ్రరీ, ఆధునిక ల్యాబొరేటరీలు, ఆడిటోరియం, ఓపెన్ థియేటర్, స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లు, గెస్ట్ హౌస్, ఫ్యాకల్టీ క్వార్టర్స్ వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల క్రీడా అభివృద్ధి కోసం విస్తృతమైన క్రీడా మైదానాలు, బాస్కెట్‌బాల్, వాలీబాల్ కోర్టులు కూడా ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. క్యాంపస్‌ అంతటా విశాలమైన అంతర్గత రోడ్లు నిర్మించనున్నారు.

తాగునీటి సదుపాయం కోసం బోర్‌వెల్స్, వాటర్ ట్యాంకులు, అలాగే పారిశుధ్యానికి సంబంధించిన సెప్టిక్ ట్యాంకులు వంటి మౌలిక వసతులను సమగ్రంగా కల్పించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో విద్యా రంగానికి కొత్త దిశానిర్దేశం అవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. IIIT క్యాంపస్ స్థాపనతో స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రావడంతో పాటు, జిల్లాకు విద్యా కేంద్రంగా గుర్తింపు పెరగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>