కలం, వెబ్ డెస్క్ : భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) కారణంగా సంభవించిన వరదలతో జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అతలాకుతలం అవుతోంది. కిష్టవార్ జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. ఆకస్మిక వరదలతో రహదారులు పూర్తిగా బురదమయంగా మారడంతో వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. నిర్మాణంలో ఉన్న క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సైట్ కు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. స్పందించిన అధికారులు రాళ్లను, బురదను తొలగించడానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మరోవైపు భారీ వర్షాల కారణంగా దోడా జిల్లాలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి, కీలకమైన జమ్మూ-కిష్టవార్ రహదారి మూసుకుపోయింది. కొండచరియల నుండి శిథిలాలు రహదారిపైకి జారిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శిథిలాలను తొలగించి, వీలైనంత త్వరగా ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి రెస్క్యూ టీములు పని చేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

