కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన G.O.Ms.No.78 ద్వారా పోలీస్ శాఖలో కేవలం 5 వేల పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతి ఇవ్వడం తీవ్ర నిరాశ కలిగించే నిర్ణయమని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర సహాయ కార్యదర్శి భావండ్ల పెళ్లి యుగంధర్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో 20 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నప్పటికీ కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని అన్నారు.
పోలీస్ అభ్యర్థులు నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చట్టవ్యవస్థను బలోపేతం చేయాలన్నా, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించాలన్నా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టడం అవసరమని పేర్కొన్నారు. మే 1, 2026న డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సి.వి. ఆనంద్ పోలీస్ శాఖలో సుమారు 19 వేల ఖాళీలు ఉన్నాయని వెల్లడించారని గుర్తు చేశారు. ఆ మేరకు కనీసం 19 వేల నుంచి 20 వేల పోలీస్ పోస్టులకు(20000 Police Jobs) రీ-నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించి పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతతో కలిసి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని AIYF హెచ్చరించింది.

