కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్ యువ రాజకీయ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి 20 ఏండ్ల రాజకీయ ప్రజా ప్రస్థానం స్ఫూర్తినివ్వాలని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుస్థిరాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించగా.. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాల అమలుతో సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్న మీ పాలన దక్షత ఆదర్శనీయం అని ప్రశంసించారు.
మరోవైపు ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డి చేసిన నిరంతర పోరాటం, ఆయన చూపిన పట్టుదల, తిరుగులేని నాయకత్వ లక్షణాలు, తెలంగాణ అభివృద్ధిపై ఆయనకున్న దూరదృష్టి నేడు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

