Mobile Popup Ad
Mobile Popup Ad

అడుగంటిన సాగర్.. కరవు కోరల్లో నల్లగొండ వ్యవసాయం!

కలం, నల్లగొండ బ్యూరో : వర్షాకాలం ప్రారంభమైన ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా రైతాంగానికి మాత్రం నీటి గోస తప్పడం లేదు. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నా వాన చినుకు మాత్రం నేలను తాకడం లేదు. జూన్ దాటి జూలై వచ్చినా వరుణుడు ముఖం చాటేయడంతో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కరవు కోరలు చేస్తున్నది. ఒకవైపు ఎండిపోతున్న నారుమళ్లు, మరోవైపు అడుగంటిన నాగార్జునసాగర్, వీటికి తోడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరెంట్ కష్టాల నడుమ నల్లగొండ రైతన్న దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతున్నాడు. గుండె నిండా ఆశతో నాగలి పట్టిన అన్నదాత.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతామనే భయంతో ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నాడు.

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఆరంభంలోనే తీవ్ర సంక్షోభంలో పడింది. రుతుపవనాల రాక ఆలస్యం కావడం, జిల్లాకు జీవనాడి అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో సాగు ముఖచిత్రం అంధకారంగా మారింది. వర్షాభావ పరిస్థితులకు తోడు నాణ్యమైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైతులు పోసిన నారుమళ్లు క్షేత్రస్థాయిలోనే ఎండిపోతున్నాయి. మూసీ ప్రాజెక్టుకు వచ్చిన స్వల్ప వరద నీరు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, ప్రభుత్వ సత్వర సాయం అందకపోతే జిల్లాలో వ్యవసాయ రంగం కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది.

ఎండిపోతున్న నారుమళ్లు

ఇదిలాఉంటే వర్షాలు లేకపోవడంతో రైతులు బోరుబావులనే నమ్ముకుని వరి నారుమళ్లు పోశారు. అయితే ప్రకృతి సహకరించకపోగా, అటు ప్రభుత్వ వ్యవస్థల నుంచి కూడా ఆశించిన మద్దతు లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల ఆధారంగా పోసిన వరి నారుమళ్లకు సకాలంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా అందడం లేదు. సరైన సమయానికి కరెంట్ ఇవ్వకపోవడంతో, ఎండల తీవ్రతకు సాగు చేసిన మొలకలు ఎండిపోతున్నాయి. పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కాకముందే.. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తున్నది.

డెడ్ స్టోరేజీకి నాగార్జున సాగర్

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రధాన నీటి వనరు, కల్పతరువు అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో లేకపోవడం, నిల్వలు అడుగంటడంతో సాగర్ ఆయకట్టు కింద ఉన్న లక్షలాది ఎకరాల భూములు వెక్కిరిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది అసలు వరి, పత్తి సాగు చేసేందుకు నీళ్లు అందుతాయా? లేదా? అనే గందరగోళం ఆయకట్టు రైతుల్లో నెలకొన్నది. సాగర్ నమ్ముకున్న రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలో.. లేక వర్షాల కోసం నిరీక్షించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

మూసీ ప్రాజెక్టుకు స్వల్ప ఊరట

ఉమ్మడి జిల్లా అంతటా కరవు ఛాయలు అలముకున్న వేళ మూసీ ప్రాజెక్టు పరివాహక ప్రాంత రైతాంగానికి మాత్రం కొంత ఊరట లభించింది. హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మూసీ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మూసీ కుడి, ఎడమ కాలువల కింద ఉన్న రైతాంగానికి సాగుపై కొంతమేర ఆశలు చిగురిస్తున్నాయి. అయితే, ఇది జిల్లా మొత్తం అవసరాలను తీర్చడానికి ఏమాత్రం సరిపోదని నిపుణులు అంచనా వేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంత ముందుకు వెళ్తున్నా.. ప్రకృతి కరుణించకపోతే మనిషి శ్రమ వృథా అనడానికి నల్లగొండలో ప్రస్తుత పరిస్థితే నిదర్శనం. నిరంతరం కరువుతో అల్లాడే ఈ జిల్లాలో వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి గ్రామ గ్రామాన ప్రజలు, రైతులు ప్రత్యేక పూజలు, వరుణ యాగాలు నిర్వహిస్తున్నారు. కప్పతల్లి ఆటలు, యజ్ఞాలు చేస్తూ వర్షం కోసం దేవుడిని వేడుకుంటున్నారు.

కరెంట్ కష్టాలతో అప్పుల ఊబిలోకి..

అయితే ప్రస్తుత తరుణంలో బోరుబావులపై ఆధారపడే రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సకాలంలో నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందించడం అత్యంత కీలకం. ఒకవైపు వర్షాభావం.. మరోవైపు కరెంట్ కష్టాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. సకాలంలో ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే.. అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్యల వైపు వెళ్లే ప్రమాదం ఉందని క్షేత్రస్థాయి నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికైనా యంత్రాంగం కదిలి, ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>