కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఒక ప్యాసింజర్ బస్సు నియంత్రణ కోల్పోయి లోతైన రాతి లోయలోకి దూసుకెళ్లింది (Pakistan Bus Accident). ఈ ప్రమాదంలో కనీసం 40 మంది మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. నైరుతి పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా సరిహద్దు సమీపంలోని దానాసర్ (Danasar) పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
అధికారుల సమాచారం ప్రకారం, క్వెట్టా నుండి ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గమధ్యంలో మరో బస్సు చెడిపోవడంతో, ఆ వాహనంలోని ప్రయాణికులను కూడా ఇదే బస్సులోకి ఎక్కించారు. దీనివల్ల బస్సు పరిమితికి మించి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. దానా సర్ పరిసర ప్రాంతాల్లో వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న రాతి గుట్టల మధ్యలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పరిపాలనా యంత్రాంగం, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలం నుండి 40 మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

