కలం, మహబూబ్ నగర్ బ్యూరో : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, డిమాండ్ల సాధనకు ఆగస్టు 9వ తేదీ నుండి 15 వరకు దేశవ్యాప్తంగా సిపిఐ (CPI) పాదయాత్రలకు శ్రీకారం చుడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాల నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా సిపిఐ కార్యాలయంలో పార్టీ జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన బాలనరసింహ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. ఎన్నికలప్పుడు మాత్రం తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే బిజెపి నేతలు పాలమూరు రంగారెడ్డి కీ జాతీయ హోదా కల్పించడంలో ఎందుకు నోరు మెదపడం లేదని అన్నారు. సర్ పేరుతో ఓటర్ల జాబితాను తారుమారు చేస్తూ లక్షల ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ జిల్లాలో నారాయణపేట వనపర్తి జిల్లాలో అత్యధికంగా 45 శాతం పైగా ఓట్లు తొలగింపు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుందని అన్నారు. సర్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండి ఓటు హక్కును కాపాడుకోవాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలని, నూతన జిల్లాల సమగ్ర అభివృద్ధికై ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేసి సాగు తాగునీరు అందించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఐ శ్రేణులు పోరుబాటకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ (CPI) జిల్లా కార్యదర్శి బి.బాలకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సురేష్, డి.రాము, భాగీ కృష్ణ యాదవ్, గోవర్ధన్, కొండికంటి పద్మావతి, జిల్లా సమితి సభ్యులు అమర జ్యోతి, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్, భార్గవి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, శివ, నరసింహ శెట్టి తదితరులు పాల్గొన్నారు.
Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్
Follow Us On: Instagram

