కలం, వెబ్‌డెస్క్: ద్రాక్ష పండ్లు (Grapes).. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతిఒక్కరూ ఇష్టంగా తినే పండ్లు. తీపి, వగరు రుచితో ఉండే ఈ పండ్లను ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. స్కూల్ కు వెళ్లే పిల్లలను స్నాక్ బాక్స్‌లో గ్రేప్స్ పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. అయితే సాధారణంగా ద్రాక్ష పండ్లు రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటి పచ్చ ద్రాక్ష, రెండోది నల్ల ద్రాక్ష. ఇవి రెండు కూడా మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి. అయితే వీటిలో ఏది ఎక్కువ మంచిది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని గురించి వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండు రకాల ద్రాక్ష పండ్లలోనూ విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ విషయానికి వచ్చే సరికి ఈ రెండింటిలో ఏది బెస్ట్, ఏ ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యం, చర్మసౌందర్యానికి ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం..
పచ్చ ద్రాక్ష (Green Grapes)
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి, విటమిన్-కె పచ్చ ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయిని చెబుతున్నారు. ద్రాక్ష పండ్లలో రెస్‌వెరాట్రాల్ (Resveratrol) అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అయితే నల్ల ద్రాక్షతో పోలిస్తే పచ్చ ద్రాక్షలో ఇది కొంచెం తక్కువ పరిమాణంలో ఉంటుందట. నల్ల ద్రాక్షతో పోలిస్తే పచ్చ ద్రాక్షలో పీచుపదార్థం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు.
నల్ల ద్రాక్ష (Black Grapes)
రెండు రకాల ద్రాక్ష పండ్లలోనూ పోషకాలు ఉన్నప్పటికీ, నల్ల ద్రాక్షలో కాస్త ఎక్కువగా పోషకాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఆంథోసైనిన్స్ (Anthocyanins) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన ఈ ద్రాక్షకు ముదురు రంగు వస్తుంది. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల నష్టాన్ని నివారించడంలో ఇవి సహాయపడతాయి. పచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షలో రెస్‌వెరాట్రాల్ అధిక మొత్తంలో ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణను సజావుగా ఉంచడంలోనూ, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ నల్ల ద్రాక్ష సహాయపడుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడానికి, చర్మ సౌందర్యానికి, వృద్ధాప్య ఛాయలను తగ్గించడానికి నల్ల ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
పచ్చ ద్రాక్ష Vs నల్ల ద్రాక్ష ఏది బెటర్?
బరువు తగ్గాలనుకునేవారికి, విటమిన్-సి ఎక్కువగా కావాలనుకునేవారికి పచ్చ ద్రాక్ష ఉత్తమమైనదని చెబుతున్నారు నిపుణులు. కానీ, గుండె ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల నివారణ, అధిక యాంటీఆక్సిడెంట్లు కావాలనుకునేవారు మాత్రం నల్ల ద్రాక్ష తమ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. యాంటీఆక్సిడెంట్ల లభ్యత పరంగా పచ్చ ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్ష కొద్దిగా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, మీ ఆహారంలో ఈ రెండు రకాల ద్రాక్షలను మార్చి మార్చి తీసుకోవడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయని చెబుతున్నారు నిపుణులు. షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం వీటిని తినేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.

