కలం, స్పోర్ట్స్: భారత క్రికెటర్లకు ప్రతి ఏడాది కనీసం నెల రోజుల పాటు ఎలాంటి మ్యాచ్‌లు లేకుండా పూర్తి విశ్రాంతి ఇవ్వాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) బీసీసీఐకి సూచించారు. అఫ్గానిస్థాన్‌పై భారత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ తరచూ అఫ్గానిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక వంటి అభివృద్ధి చెందుతున్న క్రికెట్ దేశాలకు మద్దతు ఇస్తోందని గవాస్కర్ గుర్తు చేశారు. అలాంటి పర్యటనలు ఆ దేశాల క్రికెట్ అభివృద్ధికి, ఆర్థికంగా కూడా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. అయితే భారత ఆటగాళ్ల ఆరోగ్యం, ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యమని అన్నారు.
ప్రస్తుతం క్రికెట్ షెడ్యూల్ చాలా బిజీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏడాదిలో ఒక నెల పూర్తిగా విశ్రాంతి ఉండేలా బీసీసీఐ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. భారత్‌లో ప్రతిభకు కొదవ లేదని, అవసరమైతే ఆటగాళ్లను మారుస్తూ జట్టును నడపవచ్చని చెప్పారు. కానీ కేవలం విశ్రాంతి కారణంగా సీనియర్ ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. భారత జట్టులో చోటు సంపాదించుకోవాలంటే అది ప్రతిభతోనే రావాలని పేర్కొన్నారు.
వర్క్‌లోడ్ మేనేజ్మెంట్ పేరుతో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం కూడా ఆయన ప్రశ్నించారు. సాధ్యమైనంత వరకు భారత్ తన అత్యుత్తమ జట్టుతోనే బరిలోకి దిగాలని అన్నారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టును ఉదాహరణగా ప్రస్తావించిన గవాస్కర్, ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలు సాధించారని గుర్తు చేశారు. యువ ఆటగాడు మానవ్ సుతార్ ఆకట్టుకునే అరంగేట్రం చేశాడని చెప్పారు. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారని, అలాంటి మ్యాచ్‌లో అతనికి మరిన్ని వికెట్లు సాధించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
యువ ఆటగాళ్లకు అవకాశాలు రావాలని తాను పూర్తిగా మద్దతు ఇస్తానని గవాస్కర్ (Sunil Gavaskar) స్పష్టం చేశారు. ఇండియా-ఏ, అండర్-19 మ్యాచ్‌ల ద్వారా వారికి అనుభవం కల్పించాలని సూచించారు. అయితే సీనియర్ ఆటగాళ్లకు కూడా సరైన విరామం కల్పించడం అవసరమని చెప్పారు. ఈ ఏడాది షెడ్యూల్ ఇప్పటికే ఖరారైందని, అందులో మార్పులు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు.
అయితే వచ్చే ఏడాది ఐపీఎల్‌ను ముందుగానే నిర్వహించే ఆలోచన ఉంటే, ఆటగాళ్లతో పాటు అభిమానులకు కూడా ఒక నెల విరామం దొరికేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అఫ్గానిస్థాన్ సిరీస్ తర్వాత భారత జట్టు తదుపరి ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

