Mobile Popup Ad
Mobile Popup Ad

పేదల భూములపై కాంగ్రెస్ కన్ను.. హరీశ్ రావు ఆగ్రహం

కలం, ఖమ్మం బ్యూరో: ఎన్నికల ముందు ‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకొస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం క్షేత్రస్థాయిలో పేదలపై ఒత్తిడి తెస్తూ ‘హిట్లర్ పాలన’ నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం సర్వే నంబర్ 218లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల వివాదంపై.. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి హరీశ్ రావు మంగళవారం ఖమ్మంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. 2018లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాదాపు 625 మంది పేదలకు అధికారికంగా ప్లాట్లు కేటాయించి పట్టాలు పంపిణీ చేసిందని గుర్తుచేశారు. అక్కడ రోడ్లు, విద్యుత్, త్రాగునీటి సదుపాయాల కోసం బోర్లు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలు తమ సొంత ఖర్చులతో బేస్‌మెంట్‌లు, రేకుల షెడ్లు నిర్మించుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైవే నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు వంటి కారణాలను చూపిస్తూ పేదల భూములను బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తోందని  ఆరోపించారు.

అధికారులు పేదలను బెదిరిస్తూ అఫిడవిట్లపై సంతకాలు తీసుకుంటూ ‘బ్లాక్‌మెయిల్ రాజకీయాలు’ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని (Minister Ponguleti) ఉద్దేశించి, పేదలను రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నారని హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. బాధిత పేదలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడుతుందని భరోసా ఇచ్చారు. పేదల తరఫున న్యాయపోరాటం చేస్తామని, ఇప్పటికే ఖమ్మం కలెక్టర్‌తో మాట్లాడామని, త్వరలోనే హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీతో చర్చించి పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదని, కానీ కూల్చివేతలు మాత్రం ఎక్కువయ్యాయని విమర్శించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేవలం ఖాళీ పట్టాలు ఇచ్చిందని, కానీ 2018లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన స్థలాలను పేదలకు అందించిందని తెలిపారు.

అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఆ పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ అవసరాల పేరుతో పేదలను ఇళ్లులేని పరిస్థితికి నెట్టేస్తోందని, రఘునాథపాలెంలో పేదల భూములను కాంగ్రెస్ నేతలు ఆక్రమిస్తున్నారని పువ్వాడ ఆరోపించారు. పేదల హక్కుల కోసం బీఆర్‌ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుందని, అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Read Also: ఇండియా ఇష్టం లేదు.. డ‌బ్బులొస్తే వెళ్లిపోతా: కాక్రోచ్ పార్టీ క్యాంపైన‌ర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>