Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో బియ్యం స్మగ్లింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టు

క‌లం, నల్లగొండ బ్యూరో: రేషన్ బియ్యాన్ని రీ-సైక్లింగ్ చేసి విదేశాలకు తరలించే అంతర్జాతీయ బియ్యం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ (Rice Smuggling Network)ను నల్లగొండ (Nalgonda) విజిలెన్స్ ఆఫీసర్లు గుట్టురట్టు చేశారు. ఆర్జాలబావి బైపాస్ రోడ్డులో శని, ఆదివారాల్లో చేపట్టిన తనిఖీల్లో 26 బియ్యం లారీలను సీజ్ చేశారు. దీంతో బ్లాక్ మార్కెట్ మాఫియా దందా వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ కొనుగోళ్ల పేరుతో అధికారుల కళ్లుగప్పి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించేందుకు సిద్ధం చేసిన వందలాది క్వింటాళ్ల బియ్యం పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రభుత్వ సబ్సిడీలు, పౌర సరఫరాల శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలకు ఘటన నిదర్శనంగా మారింది.

జంబో సంచుల్లోకి బియ్యం మార్పిడి

నల్లగొండ టౌన్ బైపాస్ రోడ్డులోని శ్రీనిధి పైపుల కంపెనీ షెడ్లలో రేషన్ బియ్యం అక్రమ దందా జరుగుతుందనే విశ్వసనీయ సమాచారంతో విజిలెన్స్ ఆఫీసర్లు దాడులు చేశారు. అక్కడ 26 లారీల్లో బియ్యాన్ని గుర్తించారు. 50 కిలోల గన్నీ సంచుల్లోని బియ్యాన్ని కట్ చేసి, వెయ్యి కిలోల సామర్థ్యం కలిగి భారీ ప్లాస్టిక్ (జంబో) సంచుల్లోకి మారుస్తున్నట్లు బయటపడింది. సాధారణంగా జంబో ప్యాకింగ్‌ను అంతర్జాతీయ ఓడరేవుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసే సరుకుల కోసం ఉపయోగిస్తారు. దీంతో ఇక్కడి బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బేవరేజెస్ కంపెనీ కథ ఏమిటి?

విజిలెన్స్ విచారణలో లారీ నిర్వాహకులు ఆసక్తికర వివరణ ఇచ్చారు. బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి టెండర్ ద్వారా క్వింటాలుకు రూ.2,300 చొప్పున కొనుగోలు చేశామని, కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రముఖ బేవరేజెస్ కంపెనీకి తరలిస్తున్నామని తెలిపారు. 2024–25 సీజన్‌కు చెందిన బై-ప్రొడక్ట్స్ (నూకలు) అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఇక్కడే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బియ్యం నిజంగా కామారెడ్డిలోని బేవరేజెస్ కంపెనీకి తరలించాల్సి ఉంటే, లారీలు నల్లగొండలోని పైపుల కంపెనీ షెడ్లకు ఎందుకు చేరాయి? ఒకవేళ కామారెడ్డికి తీసుకెళ్లి అక్కడ ప్యాకింగ్ చేసి మళ్లీ కాకినాడ పోర్టుకు తరలిస్తే రవాణా వ్యయం భారీగా పెరుగుతుంది.

నల్లగొండ నుంచి కాకినాడకు రవాణా సౌలభ్యం ఉండటంతో ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌లో క్వింటాలుకు సుమారు రూ.2,320కే నాణ్యమైన బియ్యం లభిస్తుండగా, ఎఫ్‌సీఐ నుంచి రూ.2,300 చెల్లించి నూకలు కొనుగోలు చేయాల్సిన అవసరం బేవరేజెస్ కంపెనీకి ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. స్థానిక రేషన్ డీలర్లతో కుమ్మక్కై అక్రమ రవాణా చేస్తున్నారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నది.

ఎఫ్‌సీఐ నుంచి చట్టబద్ధంగా కొనుగోలు చేసి…

ఎఫ్‌సీఐ నుంచి సంబంధిత వ్యక్తులు చట్టబద్ధంగానే బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తున్నది. సాధారణంగా టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన నూకలు లేదా డ్యామేజ్ బియ్యాన్ని నిర్దేశిత పరిశ్రమల అవసరాలకు మాత్రమే వినియోగించాలి. అయితే ఈ బియ్యాన్ని కామారెడ్డిలోని బేవరేజెస్ కంపెనీకి తరలించకుండా, నల్లగొండలోని శ్రీనిధి పైపుల కంపెనీని కేంద్రంగా చేసుకుని కొత్త దందాకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమార్కులు ఎఫ్‌సీఐ నుంచి కిలో రూ.15 చొప్పున బియ్యం కొనుగోలు చేసి, కాకినాడ పోర్టులోని దళారులకు కిలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం.

అనంతరం ఆ దళారులు విదేశాల్లో కిలో రూ.70 వరకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నారని తెలుస్తున్నది. ఇక్కడ మరో అనుమానం కూడా వ్యక్తమవుతున్నది. బేవరేజెస్ కంపెనీలకు వినియోగించాల్సిన డ్యామేజ్ బియ్యం, నూకల పేరుతో నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారా? ఈ వ్యవహారంలో ఎఫ్‌సీఐ అధికారుల పాత్ర ఉందా? అనే అంశాలపై విచారణ జరగాల్సి ఉంది. నూకలు, డ్యామేజ్ బియ్యం పేరుతో మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని పెద్ద ఎత్తున మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అధికారులపై ఒత్తిళ్లు?

దందా వెలుగులోకి రావడంతో ఎఫ్‌సీఐ జిల్లా మేనేజర్ సుకుమార్‌ను విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలానికి పిలిపించారు. లారీల నంబర్లు, ఎఫ్‌సీఐ గోదాముల రికార్డులను పరిశీలించారు. మరోవైపు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు బియ్యం నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రాథమిక విచారణలో ఇవి పీడీఎస్ (రేషన్) బియ్యం కాకుండా ఎఫ్‌సీఐకు చెందిన బియ్యమని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం వెనుక రాష్ట్రస్థాయిలో కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

కేసును నీరుగార్చేందుకు విజిలెన్స్ అధికారులపై ఒత్తిళ్లు వచ్చినట్లు, కొందరు కీలక వ్యక్తులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ సబ్సిడీ వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని ప్రైవేట్ కంపెనీల పేరిట విదేశాలకు బియ్యం తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో, ఈ ‘జంబో బియ్యం స్కామ్’పై విజిలెన్స్ అధికారులు ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

నల్లగొండ కేంద్రంగా దందా ఇలా..

ఒకవైపు ఎఫ్‌సీఐ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన నూకలంటూ చెబుతూనే, మరోవైపు రవాణా ఖర్చులు తగ్గించుకునేందుకు నల్లగొండను కేంద్రంగా చేసుకుని విదేశీ ఎగుమతులకు ‘జంబో ప్యాకింగ్’ చేస్తున్నట్లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బియ్యం దందా వెనుక ఎలాంటి అక్రమాలు లేకపోతే స్థానిక అవసరాల కోసం గానీ, మద్యం తయారీ పరిశ్రమలకు తరలించేందుకు గానీ ఇలా జంబో బ్యాగుల్లోకి మార్పిడి చేయాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల మౌఖిక ఆదేశాల నడుమ దందా గుట్టు ఎప్పుడు వీడుతుందోనని సస్పెన్స్ నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>