కలం, స్పోర్ట్స్: ఆసియా జిమ్నాస్టిక్స్ (Asian Gymnastics) ఛాంపియన్‌షిప్‌లో భారత యువ జిమ్నాస్టులు మరోసారి తమ ప్రతిభను చాటారు. జట్టు విభాగంలో చారిత్రాత్మక కాంస్య పతకం సాధించిన మరుసటి రోజే హర్షిత్ దామోదరన్, అక్షయ్ బజాజ్ వ్యక్తిగత విభాగంలో అదరగొట్టారు. పురుషుల వాల్ట్ విభాగంలో భారత్‌కు స్వర్ణం, రజతం అందించి దేశానికి మరో గర్వకారణంగా నిలిచారు. పురుషుల వాల్ట్ ఫైనల్లో హర్షిత్ దామోదరన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. హ్యాండ్స్ప్రింగ్ ఫ్రంట్ డబుల్ ట్విస్ట్, సుకహారా 720 విన్యాసాలను విజయవంతంగా పూర్తి చేశాడు.
ఈ రెండు ప్రయత్నాల్లో వరుసగా 13.866, 13.433 పాయింట్లు సాధించాడు. మొత్తంగా 13.649 సగటు స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరోవైపు అక్షయ్ బజాజ్ కూడా మెప్పించాడు. సుకహారా 720, యుర్చెంకో 720 విన్యాసాల్లో వరుసగా 13.500, 13.366 పాయింట్లు నమోదు చేశాడు. 13.433 సగటు స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వాల్ట్ విభాగంలో భారత్‌కు ఒకేసారి స్వర్ణం, రజతం దక్కాయి.
అంతకుముందు జూనియర్ పురుషుల ఆర్టిస్టిక్ జట్టు విభాగంలో కూడా భారత్ చరిత్ర సృష్టించింది. హర్షిత్ దామోదరన్, అక్షయ్ బజాజ్‌తో పాటు నిషాద్ నర్వానే, ఎస్కే నబీగ్ అలీ, మహ్మద్ జైద్ అన్సారీ సభ్యులుగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత్ 224.493 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. చైనా 241.458 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా, జపాన్ 239.461 పాయింట్లతో రజత పతకం దక్కించుకుంది. జట్టు విభాగంలో చారిత్రాత్మక కాంస్యం, ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం సాధించడం ద్వారా భారత యువ జిమ్నాస్టులు ఈ టోర్నీలో తమ ముద్రను బలంగా వేశారు. ఈ ప్రదర్శన భారత జిమ్నాస్టిక్స్‌కు (Asian Gymnastics) మరో ప్రోత్సాహకర ఘట్టంగా నిలిచింది.

